Bigg Boss 10 | తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా బుల్లితెరపై సందడి చేస్తూ తనదైన స్టైల్‌తో షోను ముందుకు తీసుకెళ్లారు. ఈసారి సీజన్లో సినీ, టీవీ, సోషల్ మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు.. ప్రత్యేకంగా నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ ప్రక్రియ ద్వారా ఎంపికైన సామాన్యులకు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం కల్పించారు.గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్కొక్కరు తమ తమ నేపథ్యాలు, అనుభవాలు, వ్యక్తిగత కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సీజన్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆ 16 మంది ఎవరో చూద్దాం.
1. దేబ్జానీ మోదక్
తెలుగు ప్రేక్షకులకు ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ ద్వారా పరిచయమైన దేబ్జానీ మోదక్.. బిగ్‌బాస్ 10లో తొలి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. ‘గిరగిరా గింగిరాని వే’ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆమె చేసిన ఎంట్రీ ఆకట్టుకుంది. సీరియల్ నటిగా తనకు ఉన్న గుర్తింపును బిగ్‌బాస్ ద్వారా మరింత పెంచుకోవాలని ఆమె భావిస్తున్నారు.
2. త్రిగుణ్
గతంలో అదిత్ అరుణ్ పేరుతో సినిమాల్లో నటించిన త్రిగుణ్.. ఇప్పుడు తన పేరును మార్చుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల్లో నటుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ఈ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
3. ఝాన్సీ
సింగర్‌గా గుర్తింపు పొందిన ఝాన్సీ.. గోల్డెన్ టికెట్ విజేతగా బిగ్‌బాస్ హౌస్‌లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చారు. గ్రాండ్ లాంచ్ సందర్భంగా ‘రైతు బిడ్డ’ పాటను భావోద్వేగంగా పాడి అందరినీ ఆకట్టుకున్నారు. తన గాత్రంతో పాటు గేమ్‌లో తన వ్యక్తిత్వాన్ని కూడా చూపించేందుకు సిద్ధమయ్యారు.
4. సుధీర్ రెడ్డి
‘సుధీర్ టాక్స్’ పేరుతో పాడ్‌కాస్టర్‌గా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ రెడ్డి ఈసారి బిగ్‌బాస్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాగార్జునతో మాట్లాడే సమయంలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలను పంచుకున్నారు.
5. అమన్
‘అగ్నిపరీక్ష’ ప్రక్రియలో అత్యధిక ఓట్లు సాధించి బిగ్‌బాస్ 10లో స్థానం సంపాదించిన కంటెస్టెంట్ అమన్. గేమ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను ఫ్లిప్ అవ్వనని, తన నిర్ణయాలపై నిలబడతానని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
6. చైత్ర రాయ్
‘అష్టాచమ్మా’ సీరియల్లో ‘స్వప్న’ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర రాయ్ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత తన బరువు పెరగడంపై ఎదురైన ట్రోలింగ్‌ను సవాలుగా తీసుకుని ఏకంగా 20 కిలోల బరువు తగ్గినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పుడు బిగ్‌బాస్‌లో తన మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించనున్నారు.
7. ఆటో రామ్ ప్రసాద్
జబర్దస్త్ కామెడీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన రామ్ ప్రసాద్ తనదైన కామెడీ పంచ్‌లతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీతోనే హౌస్‌లో నవ్వులు మొదలయ్యాయి. తన కామెడీతో పాటు గేమ్‌లో వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
8. షాలిని
జ్యూరీ సభ్యుడు నవీన్ ఎంపిక చేసిన సామాన్యురాలిగా షాలిని బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. తాను చాలా ఎక్కువగా మాట్లాడతానని చెప్పుకున్న ఆమె.. గ్రాండ్ లాంచ్‌లో నాగార్జునను ప్రశంసలతో ముంచెత్తారు. హౌస్‌లో ఆమె మాట్లాడే విధానం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
9. టెంపర్ వంశీ
‘టెంపర్’, ‘నేనింతే’ వంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న టెంపర్ వంశీ ఈసారి బిగ్‌బాస్‌లో తన అసలు వ్యక్తిత్వాన్ని చూపించేందుకు వచ్చారు. ఇప్పటివరకు తెరపై కనిపించిన నెగెటివ్ షేడ్స్‌కు భిన్నంగా.. తనలోని ఎమోషనల్, ఫ్యామిలీ మ్యాన్ కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తున్నారు.
10. సృష్టి వ్యాకరణం
జ్యూరీ సభ్యురాలు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీముఖి ఎంపిక చేసిన సామాన్యురాలు సృష్టి వ్యాకరణం. తన సంకల్పమే తన బలమని చెప్పుకున్న ఆమె.. ఇతరులను సులభంగా నమ్మడం తన బలహీనత అని వెల్లడించారు. గేమ్‌లో ఈ రెండు లక్షణాలు ఆమెకు ఎలా ఉపయోగపడతాయో చూడాలి.
11. నరేశ్
జబర్దస్త్ ఫేమ్ పొట్టి నరేశ్ కూడా బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టారు. గూగుల్‌లో తన పేరు వెతికినప్పుడు ‘బిగ్‌బాస్ 10 నరేశ్’ అని కనిపించాలన్నది తన లక్ష్యమని ఆయన చెప్పారు. తన కామెడీ, ఎనర్జీతో హౌస్‌లో ప్రత్యేకంగా నిలిచేందుకు సిద్ధమయ్యారు.
12. ఆర్జే చరణ్
ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపికైన ఆర్జే చరణ్ కూడా ఈ సీజన్లో కీలక కంటెస్టెంట్‌గా మారారు. తన చుట్టూ ఉన్నవారిని నవ్వించడమే తన బలమని చెప్పిన ఆయన.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునకు తాను పెద్ద అభిమానినని వెల్లడించారు.
13. కృష్ణుడు
‘హ్యాపీ డేస్’, ‘వినాయకుడు’ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. తన బరువు వెనుక ఉన్న కథను కూడా ఆయన పంచుకున్నారు. తాను అమాయకుడిని కాదని, ఇప్పటివరకు ప్రేక్షకులకు కనిపించని తన మరో కోణాన్ని ఈ షో ద్వారా చూపిస్తానని చెప్పారు.
14. వర్షిణి సౌందరరాజన్
యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్షిణి సౌందరరాజన్ బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో బిగ్‌బాస్ షోలోకి వెళ్లాలనే ఆలోచన తనకు పెద్దగా లేదని.. అయితే కాలక్రమేణా ఈ షోపై ఆసక్తి పెరిగిందని ఆమె తెలిపారు.
15. రోహిత్
జ్యూరీ సభ్యురాలు బిందు మాధవి ఎంపిక చేసిన సామాన్య యువకుడు రోహిత్. గ్రాండ్ లాంచ్ సందర్భంగా ఇచ్చిన ఓ టాస్క్‌లో హౌస్‌లోని ఒకరిపై నీళ్లు చల్లాల్సి ఉండగా.. దాన్ని సున్నితంగా తిరస్కరించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. గేమ్‌లో కూడా తన విలువలకు ప్రాధాన్యత ఇస్తారా అన్నది చూడాలి.
16. ముఖేశ్ గౌడ
బిగ్‌బాస్ 10లో చివరి కంటెస్టెంట్‌గా ముఖేశ్ గౌడ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో ‘రిషి’ పాత్రతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన.. ఈసారి బిగ్‌బాస్ ద్వారా మరింత దగ్గరవ్వనున్నారు. తన మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు భాష తన గుండెల్లో ఉందని ముఖేశ్ గౌడ చెప్పడం ఆకట్టుకుంది. తన తెలుగులో ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని ప్రేక్షకులను కోరారు.
మొత్తంగా చూస్తే బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో ఈసారి కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యానికి పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. సీరియల్ నటులు, సినీ నటులు, జబర్దస్త్ కమెడియన్లు, యాంకర్లు, సింగర్లు, పాడ్కాస్టర్లు, సోషల్ మీడియా ప్రముఖులతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. ఇక హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ 16 మంది మధ్య అసలు గేమ్ ఎలా మొదలవుతుంది? ఎవరు వ్యూహాలతో ముందుకు వెళ్తారు? ఎవరి మధ్య స్నేహం ఏర్పడుతుంది? ఎక్కడ గొడవలు మొదలవుతాయి? ఎవరు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.