Bhuvan Bam Bollywood Debut | భారతదేశంలోని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్, కంటెంట్ సంచలనం భువన్ బామ్ ఎట్టకేలకు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కి చెందిన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లో రాబోతున్న చిత్రంలో భువన్ కథానాయకుడిగా అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు భువన్ బామ్ సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు. ధర్మా ప్రొడక్షన్స్‌తో తాను చేసుకున్న ‘ఆర్టిస్ట్ అగ్రిమెంట్’ పత్రాన్ని పంచుకుంటూ, కళను చూడండి మిత్రులారా అవి తప్పకుండా నిజమవుతాయి. మీ అభిమానం మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ కావాలి అని భావోద్వేగంతో రాసుకొచ్చారు.
ఈ సినిమాకు ‘కుకు కీ కుండలి’ (Kuku Ki Kundali) అనే టైటిల్ అని ప్రచారంలో ఉంది. రొమాంటిక్ కామెడీగా రాబోతున్న ఈ చిత్రంలో భువన్ బామ్ సరసన నటి వామికా గబ్బి హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ ఫేమ్ శరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గత కొద్ది రోజులుగా భువన్ బామ్ ఎంట్రీపై వార్తలు వస్తున్నప్పటికీ కరణ్ జోహార్ ఇటీవలే ఒక లైవ్ సెషన్లో పొరపాటున ఈ విషయాన్ని వెల్లడించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ఖరారైంది. ‘BB Ki Vines’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా దేశవ్యాప్తంగా అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్న భువన్ బామ్, ఇప్పటికే ‘తాజా ఖబర్’ వంటి వెబ్ సిరీస్‌లతో నటుడిగా తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్ బాలీవుడ్లో ఆయన ప్రయాణం ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.