సాంకేతికతతో దూసుకుపోతున్న నేటి ప్రపంచంలో మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. సోషల్ మీడియాతోపాటు ఓటీపీ ఫ్రాడ్, ఎనీడెస్క్, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఫేక్ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరిట కొందరు కేటుగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా అకౌంట్లలో డబ్బు మాయం చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలు విద్యావంతులు సైతం వారి వలలో పడుతున్నారు. రెండు నెలల క్రితం జయశంకర్ జిల్లాకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి, ఓ నిరుద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. ఉద్యోగి ఖాతా నుంచి రూ.99,899, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో నిరుద్యోగి ఖాతా నుంచి రూ.24,975 దండుకున్నారు. మోసపోయానని గ్రహించిన నిరుద్యోగి 24 గంటల్లోపు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా అకౌంట్లో డబ్బు జమైంది. సింగరేణి ఉద్యోగి ఆలస్యంగా స్పందించడంతో ఆ డబ్బు తిరిగి రాలేదు. ఇకనుంచైనా ఫేక్ మెసేజ్‌లకు స్పందించి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
భూపాలపల్లి, నవంబర్ 21 : ఇటీవలికాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. రోజుకో తీరుతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. మోసపూరిత మాటలకు సామాన్యులే కాకుండా విద్యావంతులు సైతం వారి వలలో చిక్కుతున్నారు. సోషల్ మీడియాతోపాటు ఓటీపీ ఫ్రాడ్, ఎనీడెస్క్, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఫేక్ ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా డబ్బులు పంపించడం లాంటి మోసాలు ఎక్కవయ్యాయి. వారు చెప్పినట్లు చేస్తే బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు నిమిషాల్లో మాయమవుతున్నాయి. గత రెండు నెలల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి, ఓ నిరుద్యోగి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఇందులో ఒకరు 24 గంటల లోపు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని డబ్బులు అకౌంట్‌కు పోలీసులు జమచేయించారు. మరో బాధితుడు 24 గంటలలోపు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అతని డబ్బులు తిరిగి రాలేదు.
ఎలా మోసపోయారంటే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఇందులో జిల్లా కేంద్రానికి చెందిన ఓ సింగరేణి ఉద్యోగికి సెప్టెంబర్ 4న ఫోన్‌కు ఒక మెస్సేజ్ వచ్చింది. ‘మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేసుకొండి లేకపోతే హోల్డ్‌లో పడుతుంది అప్డేట్ కోసం సంప్రదించాలని ఒక సెల్ నంబర్ ఇచ్చారు. బాధితుడు ఆ నంబర్‌కు కాల్చేసి మాట్లాడాడు. సైబర్ నేరగాడు అడిగిన వివరాలు.. బ్యాంక్ డెబిట్ కార్డు, ఫిన్ నంబర్లు షేర్ చేశాడు. వెంటనే అతని అకౌంట్ నుంచి రూ.99,899 డ్రా అయినట్లు ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. మోసపోయానని ఆ ఉద్యోగి గుర్తించి24 గంటల లోపు కాకుండా, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని డబ్బులు పోలీసులు తిరిగి ఇప్పించే అవకాశం లేకుండా పోయింది.
కాటారం మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి వ్యాపారం చేద్దామని అనుకుని ఈ సంవత్సరం అక్టోబర్ 21న రూ.10 లక్షల లోన్ కోసం గూగుల్‌లో వెతికాడు. గూగుల్‌లో ఒక ఫేక్ లింకు వచ్చింది. అతడు వెంటనే తన బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, మొబైల్ నంబర్ సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత (23న) అతడికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీరు లోన్ కోసం ఐప్లె చేశారు కదా, లోన్ ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు రూ. 24,975 చెల్లించాని అడిగాడు. సదరు బాధితుడు నిజమేనని అనుకుని అతడు అడిగిన మొత్తాన్ని పంపాడు. తర్వాత బాధితుడికి లోన్‌కు సంబంధించి డబ్బులు జమకాలేదు. మోసపోయానని గుర్తించి వెంటనే (24 గంటల లోపు ) 155260 స్టేట్ సైబర్ క్రైం టోల్ ప్రీ నంబర్‌కు కాల్ చేశాడు. వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం బృందాన్ని అప్రమత్తం చేశారు. ఇక్కడి బృందం సంబంధిత బాధితుడితో మాట్లాడి సైబర్ నేరగాడు అకౌంట్ కలిగి ఉన్న బ్యాంక్ అధికారులను సంప్రదించారు. అతడి అకౌంట్‌ను నిలుపుదల చేయించి, బాధితుడి బ్యాంక్ అకౌంట్‌కు తిరిగి డబ్బులను జమచేయించారు. చాకచక్యంగా కేసును ఛేదించి బాధితుడి డబ్బు తిరిగి ఇప్పించిన జిల్లా సైబర్ క్రైం బృందాన్ని అదనపు ఎస్పీ వీ శ్రీనివాసులు అభినందించారు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్లతో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా 9440904735 నంబర్, 100 డయల్, లేదా స్టేట్ సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 155260కు కాల్ చేసి, 24 గంటల లోపు సమాచారం ఇవ్వాలి. అలా అయితేనే డబ్బులను తిరిగి పొందే అవకాశం ఉంటుంది.