ప్రపంచ యుద్ధాలనేవి రంగం మీదికి రానంతవరకూ, చౌరస్తాలో సరాయి లాంటిది అమెరికా! అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎవరైనా పనిచేయించుకోవచ్చు, మరెవరైనా చెయ్యొచ్చు. పనంతా అయిపోయాకా, బట్వారా చేసి చేతులు కడుక్కున్న తర్వాత, కూలీ, మేస్త్రీ, కామందు ముగ్గురూ కలిసివెళ్లి ఒకే అంగట్లో కాస్త గొంతు తడుపుకోవచ్చు. ఆ తర్వాత ఎవరి దారిన వారు పోవచ్చు!
ఈ పరిస్థితి మారిపోయి నూరేండ్లు దాటిపోయింది. అదలా ఉంచండి! మనం ప్రపంచ చరిత్ర గురించి మాటాడుకోడానికి ఇక్కడికి రాలేదు. మన సాహిత్యసీమను ఏలుతున్న కథానిక గురించీ, దాని కమామిషు గురించీ మాటాడుకోడానికొచ్చాం! కథానిక పుట్టి, మెట్టిన ఇండ్లలో అమెరికా ఒకటి కనకనే దాని మాట అనుకోవలసి వచ్చింది మనకు. వాషింగ్టన్ ఇర్వింగ్ (1783-1859), ఎడ్గార్ యాలన్ పో (1809-1849), నెథానియెల్ హాథార్న్ (1804-1864), మార్క్ ట్వెయ్న్ (1835-1910), ఓ.హెన్రీ (1862-1910), ఎర్నెస్ట్ హెమింగ్వే (1899-1961), యాంబ్రోస్ బయెర్స్ (1842-?) లాంటి అమెరికన్ కథకుల గురించి ప్రస్తావించుకోకుండా, కథానిక చరిత్ర గురించి అర్థవంతంగా మాటాడుకోవడం సాధ్యం కాదు మరి!
ప్రపంచ చరిత్రలో బహుముఖ ప్రజ్ఞావంతులు లేని దశ అనేది ఏదీ లేదు! కానీ పందొమ్మిదో శతాబ్దిలో, అన్ని దేశాల్లోనూ ఈ ‘బహుముఖ ప్రతిభ’ బహుముఖంగా వెల్లివిరిసినట్లు కనిపిస్తుంది. దానికేవో కారణాలు ఉండే ఉంటాయి. కానీ, ఇప్పుడు మనకవి అనవసరం.
మనకు ఇప్పుడు అవసరమైన విషయమేమిటంటే, ఆధునిక అమెరికన్ కథకు ఆద్యుడనిపించుకున్న ఎడ్గార్ యాలన్ పో ఆ కోవకు చెందినవాడే. కవి, కథానిక రచయిత, నవలా రచయిత, సాహిత్య విమర్శకుడు, సంపాదకుడు కూడా అయిన పో, తన నలభయ్యేండ్ల జీవితకాలంలో గొప్ప ‘క్రిప్టోగ్రాఫర్’గా కూడా ప్రసిద్ధుడు కాగలిగాడు. పైపైన చూస్తే అర్థం కానంత నిగూఢంగా గుప్తరచన చెయ్యడమూ, అలాంటి ‘గుప్తరచన’ల ముడివిప్పి చదవడమనే గుప్తజ్ఞానమే క్రిప్టోగ్రఫ్రీ అంటే! మన భారతీయులకు ఈ మహావిద్య కరతలామలకమే గదా! చిత్రబంధ కవిత్వాలు చదివి బోధపరుచుకోలిగిన వారందరూ ఆధునిక పరిభాషలో క్రిప్టోగ్రాఫర్లే! అదలావుంచండి. ‘పో’ కన్నుమూసే కాలానికి కథానికకు ‘షార్ట్ స్టోరీ’ అనే పేరు స్థిరపడలేదు. ‘పో’ అలాంటి రచనలను ‘వచన కథనా’లనే అన్నాడు. కన్నుమూయడానికి పదేండ్లు ముందు ‘పో’ రాసిన ‘విలియమ్ విల్సన్’ చక్కని నిర్మితితో కూడిన కథానిక!’ అని కీర్తించని విమర్శకుడు లేడు!
ఇక, ‘పో’ రాసిన అపరాధ పరిశోధన కథానికలు కూడా ‘లాక్షణిక’ నిర్దుష్ట నిర్మాణ రీతులతో కూడినవని పండితులంటూ ఉంటారు. ‘సమాజంతో సామరస్యం కుదిరే వరకూ కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వ’మని మన చలం చెప్పడానికి దాదాపు నూరేండ్లకు ముందు ‘పో’ కథానిక రచన కూడా అంతటిదేనని ఓ అపరాధ పరిశోధన కథానిక ద్వారానే చెప్పాడు. ఆయన కథానికలన్నింట్లోకీ అదే చిన్నదేమో కూడా! దానిపేరు ‘ద టెల్ టేల్ హార్ట్’. ఇలాంటి కొన్ని కథల్లో శిల్పానికి సంబంధించిన అన్ని అంశాలూ నిర్మాణం, శైలి, పాత్ర చిత్రణ వగైరా తూకం వేసినట్లు కుదరడం ‘పో’ కథానికల గురించి తెలిసినవాళ్లందరికీ తెలిసిన విషయమే! ఇదే, విషయం ‘పో’ రాసిన సైన్స్‌ఫిక్షన్ కథానికలకూ వర్తిస్తుంది.
చాలామంది- శ్రీశ్రీతో సహా- ‘పో’ కవిత్వం గురించి ప్రస్తావించి ఉన్నారు. 1934 ఫిబ్రవరిలో శ్రీశ్రీ రాసిన ‘గంటలు’ కవిత ‘పో’ రాసిన శబ్దానుకరణ (అనమటోపొయిక్) గీతానికి అనువాదం కాదని కవి ప్రత్యేకంగా చెప్పారు. అదలా ఉంచితే, ‘పో’ తన కథల్లో వాక్యాలను తరచూ ‘చెక్కడం’ చూస్తాం. ఇది కేవలం అక్షరరమ్యత, లేదా శైలీరమ్యతకు పరిమితమైన వ్యామోహమేనా? ఏమాత్రం కాదు! కథానిక వస్తువులో ‘భావసమైక్యం’ గురించి చాలామందే చెప్పారు. అయితే, కథానిక తాలూకు ‘ప్రభావ సమైక్యం’ గురించి మొదటిసారి సిద్ధాంతీకరించినవాడు మాత్రం ‘పో’నే! కథాంశం, పాత్రలూ, వాటి చిత్రీకరణ, నేపథ్య వ్యవస్థ, కథకుల స్వరం, ఎత్తుబడి, ముగింపు ఇవన్నీ ‘ప్రభావ సమైక్యా’న్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని రూపుదిద్దుకోవాలని తొలిసారి చెప్పినవాడు ‘పో’.
బహుశా, విజ్ఞానశాస్త్రానికీ, కళకూ మధ్య, మనం అనుకునేంత దూరం లేదేమో! లియోనార్డో డావిన్సీ, గ్యొఠే, హంఫ్రీ డేవీ, హెడీ లమార్, మారియా సిబిలా మెరియన్, బ్రయాన్ మే తదితరులు వైజ్ఞానికులు కావడంతో పాటు కళాకారులు కూడా! ఐన్‌స్టీన్, భాభా, సారాభాయ్, రాజా రామన్న, ఎస్.చంద్రశేఖర్‌లాంటి భౌతికశాస్త్రజ్ఞులు గొప్ప పియానో వాదకులు కావడమేమిటి? పో, వెల్స్, జగదీశ్ చంద్రబోస్, అజీమఫ్ లాంటి రచయితల రచనలు ఏది చూసినా అదే అనిపిస్తుంది. ఉప్పల లక్ష్మణరావు, మహీధర నళినీమోహనరావు, చందు సుబ్బారావు రాసిన పుస్తకాలు చదివినా అలాగే అనిపిస్తుంది. కుటుంబరావు, రోహిణీప్రసాద్ హిందూస్థానీ సంగీతం గురించి ముఖ్యంగా మరాఠీ నాట్య సంగీత్ గురించి రాసిన విషయాలు చూసినా అదే అనిపిస్తుంది.