Betting App Row | నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారానికి సంబంధించి సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం హైదరాబాద్‌లోని సీఐడీ విచారణకు హాజరయ్యారు. లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు గానూ అందిన పారితోషికం మరియు కమీషన్ల లావాదేవీలపై అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా ఆమెను విచారించగా, ఇప్పుడు సీఐడీ అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఇదే వ్యవహారంలో గతంలో టాలీవుడ్ ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్ వంటి వారు కూడా విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల ప్రచారం కారణంగా సామాన్యులు ఈ బెట్టింగ్ యాప్‌ల బారిన పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.