భువనేశ్వర్: ఒడిశా సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. సుమారు 51 మహేంద్ర థార్(Thar SUVs) వాహనాలను ఆ ప్రభుత్వం ఏడు కోట్లు పెట్టి ఖరీదు చేసింది. అయితే ఆ వాహనాలను కస్టమైజ్ చేసేందుకు అదనంగా మరో 5 కోట్లు వెచ్చించింది. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. అటవీ, పర్యావరణ, వాతావరణ శాఖ కొనుగోలు చేసిన వాహనాలపై దర్యాప్తు చేపట్టేందుకు ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వన్యప్రాణుల మానిటరింగ్, అడవుల్లో పెట్రోలింగ్, యాంటీ పోచింగ్ ఆపరేషన్స్ కోసం గత ఏడాది నవంబర్‌లో ఏడు కోట్లు పెట్టి 51 థార్ వాహనాలను ఖరీదు చేశారు. ఒక్కొక్క వాహనం కోసం 14 లక్షలు ఖర్చు చేశారు. అయితే ఆ వాహనాలకు మాడిఫయింగ్ పేరుతో అదనంగా మరో 5 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఒక్కొక్క వాహనంపై సుమారు 9 లక్షలు ఖర్చు చేశారు. ఫీల్డ్ ఆఫీసర్లు, 22 జిల్లాల్లోని వైల్డ్‌లైఫ్ డివిజన్ అధికారులకు ఈ వాహనాలను అందజేశారు. ఇక సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు కోసం 9 వాహనాలను కేటాయించారు. అక్కడ ఎక్కువగా జంతువుల వేట ఉన్న కారణంగా ఎక్కువ సంఖ్యలో వాహనాలను కేటాయించారు.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి గణేశ్ రామ్ సింగ్ కుంతియా డిసెంబర్ 18వ తేదీ అకౌంట్ జనరల్ శాఖలో స్పెషల్ ఆడిట్ బృందానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ చీప్ ఆఫీసులో ప్రత్యేకంగా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. వాహనాలను ప్రోక్యూర్ చేసిన వైనం, అప్రూవ్ ఎలా ఇచ్చారో, మాడిఫికేషన్ ఎంత వరకు సమంజసం అన్న కోణంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. అయితే థార్ వాహనాలను ఆఫ్రోడ్డు సామర్థ్యంగా మార్చేందుకు ప్రతి వాహనానికి 21 మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అడవుల్లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అవసరమైన వాటిని మాడిఫై చేసినట్లు గుర్తించారు. ఫ్రంట్, రియర్ భాగంలో వాటికి మెటల్ బంపర్లు తగిలించారు. స్టీల్ వీల్స్, వెడల్పు టైర్లను అమర్చారు. అలాయ్ వీల్స్ కన్నా మెరుగ్గా స్టీల్ వీల్స్ పనిచేస్తాయన్న ఉద్దేశంతో వాటిని మార్చేశారు.
జిల్లా ఫారెస్ట్ అధికారి చేసిన అభ్యర్థనల మేరకే థార్ వాహనాలను మాడిఫై చేశారని, ఒకవేళ అదనంగా ఖర్చు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని అసెంబ్లీలో మంత్రి కుంతియా వెల్లడించారు.