e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home News దేహం దాహం తీర్చేద్దాం

దేహం దాహం తీర్చేద్దాం

ఆహారం లేకపోయినా మనిషి కొన్నాళ్లు తట్టుకోగలడు. కానీ, ఒంట్లో నీరు ఇంకిపోతే మాత్రం ప్రతి క్షణం ప్రాణాపాయంగా మారుతుంది. భగీరథుడు గంగావతరణం కోసం ఎంతగా ప్రయత్నించాడో కానీ, దాహం వేసినప్పుడు మాత్రం గుక్కెడు నీటి కోసం ఎంతటి యుద్ధమైనా చేసేందుకు శరీరం సిద్ధపడుతుంది. సమయానికి నీరు దొరక్కపోతే మన ఒంట్లో ప్రతి కణం విలవిల్లాడిపోతుంది. మండుటెండలు దంచికొడుతున్న వేళ శరీరానికి నీరు ఎందుకు అవసరమో, ఒంట్లో నీటి శాతాన్ని తగినంత స్థాయిలో ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

మన శరీరంలో మూడు వంతులు జలమే! అందులో కొంతభాగం ఆహారం నుంచి దొరుకుతుంది. పండ్లు, పచ్చికూరలు, ఉడికించిన ఆహారంలాంటి తాజా పదార్థాలను తీసుకున్నప్పుడు కాస్త ఎక్కువ నీరే లభిస్తుంది. కానీ, అది మన శరీర అవసరాలకు సరిపోదు. ఎందుకంటే, మన ఒంట్లో ముఖ్యమైన పనులెన్నింటినో చక్కబెట్టే బాధ్యత నీటిదే. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం, ఒంట్లోని వ్యర్థపదార్థాలను బయటకు పంపడం లాంటి ముఖ్యమైన పనులన్నిటికీ నీరే ఆధారం. వీటితోపాటు రక్తపోటుని అదుపు చేయడం, కణాలను ఆరోగ్యంగా ఉంచడం లాంటి సవాలక్ష బాధ్యతలు ఉదకానివే! ఈ పనుల కోసం కొంత నీటి అవసరం ఎలాగూ ఉంటుంది. కీళ్లు కదిలించడం నుంచి కనురెప్పలు ఆడించడం వరకు అనుక్షణం నీటితోనే మన జీవితం గడిచేది.

ఇవీ లక్షణాలు!
ఒంట్లో నీటి శాతం తగ్గిపోయినప్పుడు దాహం వేస్తుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే, మరిన్ని లక్షణాల ద్వారా నీరు తాగమంటూ మన శరీరం హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. నోరు పొడిబారడం, నిస్సత్తువ, తలనొప్పి, కండ్లు తిరగడం, కండరాలు పట్టేయడం, మలబద్ధకం లాంటి పరిస్థితులు వస్తాయి. ఒంట్లో రెండు శాతం నీరు తగ్గినా కూడా అది శరీరం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. చెమట పట్టడం ఆగిపోతుంది, జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది, శరీరం తడబడుతుంది, కండ్లు లోతుకి వెళ్తాయి. జ్వరం, సంధిప్రేలాపనలు లాంటి దశలు మొదలవుతాయి. మనిషి అపస్మారకంలోకి వెళ్లిపోతాడు. పెద్దవాళ్లు డీహైడ్రేషన్‌కు సంబంధించిన ఇలాంటి లక్షణాలను చాలా తేలికగా గ్రహించగలుగుతారు. కానీ, పిల్లల విషయం అలా కాదు. వాళ్ల ఒంట్లో నీరు తగ్గిపోతున్నదని తెలుసుకునేందుకు, మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వాళ్ల మాడు దగ్గర చర్మం లోపలికి వెళ్లిపోవడం, డైపర్‌ తడవకపోవడం, ఏడుస్తున్నా కన్నీరు రాకపోవడం లాంటివి గమనించి వాళ్లు డీహైడ్రేషన్‌ బారిన పడుతున్నట్టు గుర్తించవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా, మన ఒంట్లో నీటిశాతం తగ్గిపోయింది అనడానికి ఓ ముఖ్యమైన సూచన మూత్రం పచ్చబడటం. మనం తగినంత నీటిని తీసుకోవడం లేదనేందుకు సాక్ష్యమిది.

మెదడు మీద ప్రభావం
మన మెదడులో కూడా దాదాపు మూడు వంతులు నీరే ఉంటుంది. కాబట్టి, శరీరంలో నీటి శాతం తగ్గితే అది మెదడు మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, వ్యాయామం లాంటి శ్రమ చేస్తున్నప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే ఆలోచన, విశ్లేషణా సామర్థ్యాలు దెబ్బతింటాయి. ఒక పరిశోధన ప్రకారం, రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తున్నా ఒంట్లో తగినంత నీరు లేని కారణంగా మెదడు కొద్దిగా కుంచించుకుపోయిందట. డీహైడ్రేషన్‌ సమస్యని కనుక పట్టించుకోకపోతే, మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని దీనిని బట్టి అర్థమవుతుంది.

తగినంత నీరుకోసం..
వేసవి తీవ్రత మొదలైంది. దప్పికనుంచి తప్పించుకోవడానికి నీరు తీసుకోవడంతోపాటు ఒంట్లో తగినంత తేమను నిలుపుకొనేందుకు ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి.

ప్రొబయాటిక్స్
వీటినీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అవి మనం తినే ఆహారం నుంచి తగినన్ని పోషకాలను అందుకునేందుకు, శరీరానికి తగినంత శక్తిని అందించే ఎలక్ట్రోలైట్స్‌ను శోషించుకునేందుకు సాయం చేస్తాయి. అంతేకాదు! చెడు బ్యాక్టీరియాను అడ్డుకుని, విరేచనాల వల్ల డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా చూస్తాయి. మనం తినే పెరుగు, మజ్జిగ లాంటి ఆహారంలోనే తగినన్ని ప్రొబయాటిక్స్‌ ఉంటాయి.

కొబ్బరినీళ్లు
వేసవిలో మన ఆరోగ్యం బాగుండాలంటే ప్రకృతి స్వయంగా అందించే ప్యాకేజ్డ్‌ డ్రింక్‌ కొబ్బరినీరు. ఎండకాలంలో చెమటతోపాటుగా మన శరీరంలోని లవణాలు కూడా బయటకి వెళ్లిపోతాయి. అందుకే నిస్సత్తువ ఆవహిస్తుంది. లేత కొబ్బరిబోండాలలో సమృద్ధిగా నీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం లాంటి లవణాలు కూడా ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ అనే ముఖ్యమైన పోషకాలను ఇవి అందిస్తాయి.

తాజా ఆహారం


శరీరానికి కావాల్సిన 20-30 శాతం నీరు ఆహారం ద్వారా లభిస్తుంది. కొన్ని పండ్లు, పచ్చికూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు..
దోసకాయలు – 97 %
టమాటాలు, ముల్లంగి – 95 %
పుచ్చకాయలు – 92 %
ద్రాక్షపండ్లు – 90 %
ఇలా నీరు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు సరిగ్గా వేసవిలో అందుబాటులో ఉండేలా చేయడం పుడమితల్లి మనకు ఇచ్చిన వరం. దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ కాలంలో వచ్చే పండ్లు, కాయగూరలను తప్పకుండా ఆహారంలో భాగం చేయాలి.

చియాగింజలు
ఇప్పుడు అన్నిచోట్లా అందుబాటులో ఉంటున్న చియాగింజలు వేసవి దాహార్తిని తీర్చగలవు. చియాగింజలను నానబెడితే, వాటి బరువుకు 12 రెట్ల నీటిని పీల్చుకోగలవట. అలా నానబెట్టిన చియాగింజలను తినడంతో వాటిలోని నీరు నిదానంగా ఒంట్లోకి చేరుతూ శరీరానికి కావల్సిన తేమను అందిస్తాయి. ముఖ్యంగా ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు, వ్యాయామం చేసేముందు నానబెట్టిన చియాగింజలను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు.

పానీయాలు
వేసవిలో నీరు తరచూ తాగాల్సిందే. అందులో రెండో మాట లేదు. కానీ, మాటిమాటికీ నీరు తాగాల్సి రావడం కాస్త చిరాకుగానే ఉంటుంది. అందుకని నారింజ, పుచ్చకాయ, ద్రాక్ష లాంటి వాటిని కలిపిన నీటిని తాగితే రుచితోపాటు ఆరోగ్యమూ అదనం.

డీహైడ్రేషన్‌ను నివారించేందుకు..
రాత్రి నిద్రలోనూ జీవక్రియలవల్ల శరీరం నీటిని నష్టపోతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే కనీసం పావులీటరు నీరు తాగాలి. అలాగే, నిద్రకు ముందూ ఓ పావు లీటరు నీరు తాగాలి.
ఏ కాలమైనా దాహం వేసింది అంటే, అప్పటికే ఒంట్లో నీరు తగ్గిపోయిందని అర్థం. అందుకని రోజంతా అప్పుడప్పుడూ నీరు తాగాల్సిందే. ఒక నీళ్ల బాటిల్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
వేసవిలో మద్యాన్ని వీలైనంత వరకూ తగ్గించాలి. ఆల్కహాల్‌ ‘డైయురెటిక్‌’. అంటే, శరీరంలోని నీటినీ, దాంతో పాటు లవణాలనూ బయటకి పంపించే స్వభావం కలది. దీంతో డీహైడ్రేషన్‌ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
చాలామంది దాహార్తిని తీర్చుకునేందుకు కాఫీ, టీ, సోడా, కూల్‌డ్రింక్‌ లాంటివి తాగుతారు. ఇవేవీ మంచినీటికి ప్రత్యామ్నాయం కావు. పైగా ఒక్కొక్కటీ ఒక్కో విధంగా శరీరానికి చేటు చేసేవే.
వేసవికాలంలో కాస్త చల్లని నీరు తాగాలనుకోవడం సహజమే. మరీ చల్లని నీరు తాగితే అనేక సమస్యలు ఎదురవ్వవచ్చు. అందుకే మరీ చల్లగా కాకుండా, కుండలోని నీరు తాగడం ఉత్తమం.
అధిక శ్రమ చేసేవారితో పాటు మధుమేహం లాంటి సమస్యలు ఉన్నవారు, పర్వత ప్రాంతాలలో నివసించే వారు, తేమ (హ్యుమిడిటీ) తక్కువగా ఉండే ప్రదేశాల్లో జీవించేవారు మరింత జాగరూకతతో మెలగాలి.

మయూరి ఆవుల, న్యూట్రీషనిస్ట్‌,
www.trudiet.in

Advertisement
దేహం దాహం తీర్చేద్దాం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement