వివిధ జిల్లాల్లో గ్రామసభల నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములున్న జిల్లాల్లో ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ రైట్స్ కమిటీల సభ్యులు సోమవారం గ్రామసభలను నిర్వహించారు. పోడు రైతుల నుంచి ‘ఫారమ్-ఎ’ క్లెయిమ్‌లను స్వీకరించారు. పోడు భూముల్లో 2005కు ముందు సాగులో ఉన్న వారితోపాటు, ఆ తర్వాత సాగులోకి తెచ్చిన రైతులు అటవీ భూములపై సాగు హక్కుల కోసం దరఖాస్తులు సమర్పించారు.
అటవీ భూములను ధ్వంసం చేసిన వారిపై కేసులు
పోడు రైతులకు సాగుహక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుండగా.. కొంతమంది ఆక్రమణదారులు అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను ధ్వంసం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ, దమ్మపేట, సుబ్బపేట, దేవరపల్లి, పెద్దమడిసిలేరు అటవీ ప్రాంతంలో దాదాపు 20 హెక్టార్లలో నాటిన మొక్కలను తొలగించినట్టు అటవీ అధికారులు గుర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ల పరిధిలోని అడవుల్లో ఉన్న పెద్దపెద్ద చెట్లతో పాటు రెండేండ్ల క్రితం నాటిన పెద్ద మొక్కలను కూడా తొలగించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేయాలని అటవీశాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోడు వ్యవసాయం చేసే ఆదివాసీలు, ఆదివాసీయేతరులు ఇలా అడవిని ధ్వంసం చేయరని, ఆదివాసీల ముసుగులో కొంతమంది ఆక్రమణదారులే రాత్రికిరాత్రే అటవీ ప్రాంతాల్లో నాటిన మొక్కలను తొలగించి భూమిని ట్రాక్టర్లతో దున్ని సాగులో ఉన్నట్టుగా చూపే ప్రయత్నం చేశారని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.