Batasingaram Fruit Market | రంగారెడ్డి, ఫిబ్రవరి 15 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారం పండ్ల మార్కెట్లో ఈ మామిడి సీజన్ క్రయవిక్రయాలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. గత రెండు సీజన్లుగా బాటసింగారం వద్ద గల పండ్లమార్కెట్లోనే మామిడి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మామిడి క్రయవిక్రయాలను ఇక్కడే జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మామిడి పండ్లు ఈ మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉండేందుకు గానూ ఓఆర్ఆర్ పక్కన ఉన్న బాటసింగారంలో ఈ పండ్లమార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పండ్లమార్కెట్కు ప్రతి సీజన్లో వచ్చే మామిడిపండ్లను ఇతర దేశాలకు కూడా ఇక్కడినుంచే ఎగుమతి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మామిడిపండ్లను తీసుకువచ్చి రైతులు ఇక్కడ క్రయవిక్రయాలు జరుపుతారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించటంతో పాటు వారి మామిడి పండ్లు నిల్వ ఉంచుకునేందుకు గానూ కోల్డ్‌స్టోరేజీల సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం ఇక్కడే తూకాల వేబ్రిడ్జిలు, బ్యాంకు సౌకర్యంతో పాటు విశ్రాంతి భవనాలు, రాత్రి సమయంలో ఉండేందుకు షెల్టర్, తాగునీటి వంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు.
లక్ష టన్నులు వస్తాయని అంచనా..
బాటసింగారం పండ్లమార్కెట్కు ఈ సీజన్లో కూడా లక్ష టన్నుల మామిడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం లక్ష ఇరవై వేల టన్నుల మామిడి క్రయవిక్రయాలు ఈ మార్కెట్లో జరిగాయి. దానిని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం కూడా లక్ష టన్నుల వరకు వస్తుందని అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో రెండు లక్షల టన్నులు తగ్గే అవకాశం ఉన్నందున బాటసింగారం పండ్లమార్కెట్ కూడా మామిడి వచ్చే ఎగుమతి తగ్గే అవకాశాలున్నట్లు అధికారులు గుర్తించారు. మార్కెట్‌కు వచ్చే లక్షటన్నుల క్రయవిక్రయాల కోసం 2.30లక్షల ఎసెఫ్టీల షెడ్ల నిర్మాణం చేపట్టారు. అవసరమైతే అదనంగా మరిన్ని షెడ్లను వేసేందుకు కూడా అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.
22కోల్డ్ స్టోరేజీలు సిద్దం..
రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే మామిడిపండ్లు, కాయలు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పాడైపోయే అవకాశం ఉండటం వలన వాటిని నిల్వ ఉంచుకునేందుకు మార్కెటింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రైతులు తమ మామిడిపండ్లను నిల్వ ఉంచుకునేందుకు గానూ మార్కెట్లో 22 కోల్డ్‌స్టోరేజీలు కూడా సిద్దంగా ఉంచారు. వేసవిలో మామిడి పండ్లు పాడైపోకుండా ఉండటం కోసం ఈ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అలాగే, ఈ మార్కెట్ నుంచి దేశ, విదేశాలకు ఎగుమతులు అవుతుండటంతో అన్ని రకాల ప్యాకింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం : చిలుక మధుసూదన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ ఛైర్మన్
మామిడి సీజన్లో పండించిన మామిడి పండ్ల క్రయవిక్రయాలు జరుపుకునేందుకు బాటసింగారం పండ్లమార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం. మార్కెట్‌కు పెద్ద ఎత్తున పండ్లు, కాయలు వచ్చే అవకాశం ఉండటంతో వారు స్వేచ్చగా క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశాలు కల్పిస్తున్నాం. మార్కెట్ నిర్ణయించిన మేరకే కమిషన్ తగ్గిస్తామని, మధ్యలో దళారులను ఆశ్రయించవద్దు. ముఖ్యంగా రైతులు మార్కెట్లోనే ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. ఇకనుంచే లావాదేవీలు జరిపేందుకు బ్యాంకును కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం. మామిడి బయట తూకాలు వేస్తే మోసాలు జరిగే అవకాశం ఉన్నందున మార్కెట్లోనే వేబ్రిడ్జి కూడా ఏర్పాటు చేశాం.