ఉమ్మడి జిల్లా విద్యార్థుల కోసం నల్లగొండలో నిర్వహణ వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్ ఎందరి భవితకో మార్గం చూపుతున్నది. ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ, స్టడీ మెటీరియల్ సమకూరుస్తూ ఆర్ధిక భారం తప్పిస్తున్నది. నిపుణులైన ఫ్యాకల్టీతో కార్పొరేట్ స్థాయిలో శిక్షణ అందిస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థుల కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బీసీ స్టడీ సర్కిల్లో ఇప్పటివరకు 2,203మంది అభ్యర్థులు వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారు. వారిలో 143 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. మరో 500కిపైగా ప్రైవేట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. అత్యుత్తమ ఫ్యాకల్టీతో ప్రభుత్వం ఉచిత కోచింగ్ ఇప్పిస్తుండడంతో యువత ఇందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నది. సీఎం కేసీఆర్ తాజాగా చేసిన ఉద్యోగాల ప్రకటనతో బీసీ స్టడీ సర్కిల్‌కు మరింత డిమాండ్ ఏర్పడింది. ఆ మేరకు అభ్యర్థుల వెసులుబాటు కోసం స్టడీ సర్కిల్ సేవలను విస్తరిస్తూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతుండడం విశేషం.
నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్‌కు
దీటుగా నిలుస్తున్నది. తాజాగా సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన చేయడంతో స్టడీ సర్కిల్లో శిక్షణ
కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. 2013లోనే స్టడీసర్కిల్ ఏర్పాటైనా వసతుల లేమి కారణంగా వేలాది మంది
విద్యార్థులు అప్పుచేసి మరీ హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటుగా కోచింగ్ తీసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సొంత భవనంలో నిపుణులైన ఫ్యాకల్టీ పర్యవేక్షణలో బీసీ స్టడీ సర్కిల్ తమ జీవితాల్లో వెలుగులు నింపిందని ఉద్యోగం సాధించిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీసీ స్టడీ సర్కిల్లో 4,500పుస్తకాలతో లైబ్రరీ అందుబాటులో ఉన్నది. యూపీఎస్సీతోపాటు, సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 ఇతర అన్ని ఉద్యోగాలకు అవసరమైన పుస్తకాలు ఉన్నాయి. వీటితోపాటు ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంక్‌తోపాటు ఫౌండేషన్స్ కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల మెటీరియల్ మారుతున్న సిలబస్‌కు అనుగుణంగా అందుబాటులో ఉంచారు. ఉదయం 9నుంచి రాత్రి 8గంటల వరకు లైబ్రరీ తెరిచి ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పుస్తకాలను చదువుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల కోరిక మేరకు లైబ్రరీ రీడింగ్ అవర్స్ పెంచనున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వారిలో 143మంది ఫ్రభుత్వ కొలువులు సాధించారు. వీరిలో గ్రూప్ 2 ఐదుగురు, ఎస్ఐ 12మంది, పోలీస్ కానిస్టేబుల్ 51, టీఆర్టీ, గురుకుల టీచర్స్ 18, గ్రూప్ 4 నలుగురు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నలగురు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 14, వీఆర్ఓలు 10, ఆర్ఆర్బీ 10, బ్యాంకుల్లో 10, ఎస్ఎస్ఎసీ 2, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ 2, ల్యాండ్ సర్వేయర్‌గా మరొకరు ఉద్యోగం సాధించారు. ఫౌండేషన్ కోర్సులు, జాబ్‌మేళా ద్వారా మరో 500మందికిపైగా ప్రైవేట్, ఇతర సంస్ధలో ఉద్యోగాలు సాధించినట్లు తెలుస్తున్నది.
బీసీ స్టడీ సర్కిల్‌కు వచ్చే నిరుద్యోగుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాష్ట్రస్థాయిలో నిపుణులైన వారితో తరగతులు కొనసాగిస్తున్నాం. ఇప్పటి వరకు 2,203మంది శిక్షణ తీసుకుంటే వారిలో 149మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. మరో 500మందికిపైగా ప్రైవేట్, ఇతర రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్ అందించిన రూ.1.75లక్షల ఆర్థిక సహకారంతో లైబ్రరీకి పుస్తకాలు కొనుగోలు చేశాం. శిక్షణ సమయంలో రోజూ రెండు సార్లు టీ, స్నాక్స్, శిక్షణ తర్వాత మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నాం. ప్రైవేట్ సెంటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా డైలీ, వీక్ల టెస్టులతో పాటు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తుంటాం. అభ్యర్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గ కేంద్రాల్లో ఏప్రిల్‌లో శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– కె.విజయ్‌కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్
నేను, మా చెల్లెలు డిగ్రీ పూర్తి చేసి బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకున్నాం. అన్ని రకాల పుస్తకాలతో లైబ్రరీ అందుబాటులో ఉండటం మాకు కలిసొచ్చింది. శిక్షణ పూర్తి కాగానే లైబ్రరీకి వెళ్లి రోజూ 8గంటలు చదువుకునే వాళ్లం. స్టడీ సర్కిల్లో చక్కటి వాతావరణం, ఉదయం, సాయంత్రం టీ, స్నాక్స్ ఉచితంగా ఇచ్చారు. శిక్షణ తర్వాత నాకు ఆరు ఉద్యోగాలు వచ్చాయి. గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికై ప్రస్తుతం జనగామ జిల్లాలో పనిచేస్తున్నాను. నా చెల్లెలు లావణ్య డిప్యూటీ సర్వేయర్‌గా ఎంపికై మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్నది. మా లాంటి పేద కుటుంబాలకు బీసీ స్టడీ సర్కిల్ భరోసా కల్పించింది.
– బస్వ మధు, కేసరాజుపల్లి, నల్లగొండ, ఎక్సైజ్ ఎస్ఐ, జనగాం జిల్లా
నల్లగొండ జిల్లా కేంద్రంలో 2013 సంవత్సరంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు పెద్దగా లేకపోవడం, నిధుల లేమి కారణంగా స్టడీ సర్కిల్ అంతంత మాత్రంగానే కొనసాగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతోపాటు మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో నాటి నుంచి వివిధ పోటీ పరీక్షలకు 2,203 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. మహిళా అభ్యర్థులకు సమీపంలోని బీసీ హాస్టల్లో ఉచిత వసతిని కూడా కల్పించడంలో డైరెక్టర్ విజయ్‌కుమార్ చొరవ మర్చిపోలేనిదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజవర్గ కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో అనువైన ప్రాంతాలు, వనరుల సమాచారంపై ఇప్పటికే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి అందాయి. ఆయా ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ త్వరలోనే అందుబాటులోకి రానున్నది.
పైసా ఖర్చు లేకుండా బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుని ఉద్యోగం సాధించా. సివిల్ ఎస్ఐగా ఉద్యోగంలో చేరిన తర్వాత గ్రూప్-2లో ఎంపికై ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం సాధించాను. స్టడీ సర్కిల్ లైబ్రరీలో అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు ఉన్నాయి. మెటీరియల్‌తో పాటు నిత్యం ఉదయం 9నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివి నోట్స్ తయారు చేసుకున్నాను. వాటికి తోడు మోటివేషన్ తరగతులు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
– షేక్ చాంద్‌బీ, ఎక్సైజ్ ఎస్ఐ, హుజూర్నగర్
బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్ధమెటిక్ రీజనింగ్, కరంట్ అఫైర్స్ , కంప్యూటర్ అంశాల్లో ఫ్యాకల్టీ చెప్పిన అంశాలతోపాటు లైబ్రరీని ఉపయోగించుకుని పట్టు సాధించా. గ్రాండ్ టెస్టుల ద్వారా నేను ఏ స్థాయిలో ఉన్నా అనే విషయాన్ని పునశ్చరణ చేసుకుంటూ మూడు నెలల శిక్షణను సద్వినియోగం చేసుకున్నా. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగం సాధించాను.
– ఎన్.ప్రభాకర్, కట్టంగూర్, బ్యాంక్ క్లర్క్
బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణతో పాటు అభ్యర్థులపై నిరంతర పర్యవేక్షణ కూడా ఉంటుంది. తరగతుల వారీగా హాజరు నమోదు చేస్తారు. దాంతో రోజూ శిక్షణకు హాజరయ్యేలా చూడడంతో పాటు ఉద్యోగ సాధనకు వేదికైది. ముఖ్యంగా స్టడీ సర్కిల్లో లైబ్రరీలో ఎంతో ఉపయోగపడుతుంది. వీక్లీ, గ్రాండ్ టెస్టులు పెట్టడంతో మన సామర్థ్యం తెలుస్తుంది. ప్రస్తుతం నేను గుర్రంపోడు మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్నాను. ప్రతి విద్యార్థికీ బీసీ స్టడీ సర్కిల్ భరోసా కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
– గుండు మణిసాయి, వీఆర్ఓ, నల్లగొండ
నేను బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. మా అమ్మ కూలి పనులు చేస్తూ చదివించింది. బీసీ స్టడీ సర్కిల్లో చేరి శిక్షణ తీసుకున్నా. స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్కుమార్సార్ బీసీ హాస్టల్లో వసతి, భోజనం అవకాశం కల్పించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నిపుణులై ఫ్యాకల్టీ శిక్షణ ఇవ్వడంతో ఉద్యోగం వస్తుందనే నమ్మకం కలిగింది. మెటీరియల్‌తోపాటు రోజూ లైబ్రరీలో 8గంటలు చదువుకున్నాను. 2017లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికై ప్రస్తుతం కల్మలచెర్వు జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్నాను. బీసీ స్టడీ సర్కిల్ పేద విద్యార్థులకు వరం.
– మైలా సంతోష, అప్పాజిపేట, నల్లగొండ
బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణతోపాటు లైబ్రరీలో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. శిక్షణ తర్వాత గ్రూప్ 2కు ఎంపికైనా ఇంటర్వ్యూలో మిస్ అయ్యింది. అయినప్పటికీ ఆత్మైస్థెర్యంతో అడుగులు వేశా. గురుకుల టీజీటీ, పీజీటీ, హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్‌తోపాటు గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికయ్యా. ప్రస్తుతం సాంఘిక సాంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ప్రైవేట్ శిక్షణ సంస్థలో కూడా లేని సౌకర్యాలు, ఫ్యాకల్టీ బీసీ స్టడీ సర్కిల్లో ఉండడం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.
– ఎలగందుల అర్చన, లెక్చరర్, సూర్యాపేట