Chandrahas | టాలీవుడ్ బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుక తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో చంద్రహాస్ స్టేజీపై అసభ్య పదజాలం ఉన్న పాటను పాడటం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. అయితే ఈ వివాదంపై తాజాగా దర్శకుడు, నిర్మాత స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. సినిమాలో అతడి పాత్ర గురించి చెప్పే ఉద్దేశ్యంతో ఆ పాట పాడాడు. అయితే ఆ పాటలో అతడు నోరు జారడం ఎవరు ఊహించలేదు. అతడు కూడా కావాలని చేయలేదు. ఈ విషయం గురించి మేము కూడా బాధపడుతున్నాం. ఈ పాట పాడిన అనంతరం కిందికి వచ్చిన చంద్రహాస్ని పిలిచి ఇంకోసారి అలా చేయకని చెప్పామని నిర్మాత అన్నాడు. దర్శకుడు సంపత్ రుద్ర కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. చంద్రహాస్ అలా పాడినందుకు చాలా బాధగా ఉంది. మేము ఎవరం అలా ఊహించలేదు. ఈ సినిమాలో అలాంటి వివాదాస్పదమైన అంశాలు లేవంటూ దర్శకుడు తెలిపాడు.