హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్‌లో నైతిక విజయం టీఆర్ఎస్దేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి భారతీయ జనతా కాంగ్రెస్‌గా పోటీ చేశాయని, ఆ పొత్తుల అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఏడుపు మొఖంతో గెలిచారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఒకే అభ్యర్థిని రంగంలో దింపాయని తాము చేసిన వాదన నిజమైందని చెప్పారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, కృష్ణమోహనరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తిలేకనే బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అటు ఢిల్లీలో శత్రువులుగా నటిస్తూ హుజూరాబాద్‌లో మిత్రులుగా మారటం సిగ్గు చేటన్నారు. ‘బండి సంజయ్ ట్రిపుల్ ఆర్ అంటుంటే ఏమో అనుకున్నాం. కానీ అందులో రాజాసింగ్, రఘునందన్‌తోపాటు మరో ఆర్ అంటే రేవంత్‌రెడ్డి అని తేలిపోయింది’ అని సుమన్ పేర్కొన్నారు. నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌కు కొనటం, అమ్మటం బాగా తెలుసునని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను ఈటలకు తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు.
కేంద్రాన్ని ఒప్పించి, మోదీ కాళ్లు మొక్కి అయినా సరే ఈటల రూ.5 వేల కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు. హుజూరాబాద్‌లో గెలవగానే బీజేపీ నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని తేలిపోయిందన్నారు. ఎన్నికల సంఘం కేంద్ర జేబు సంస్థగా మారిపోయిందని ఆరోపించారు.