Nandamuri Mokshagna | ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తారాయన. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇదిలావుంటే.. తాజాగా బాలయ్య సినిమాల లైనప్ విషయంలో ఓ కొత్త వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. ఇటీవలే బాలకృష్ణను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలిశారట. వారిద్దరి కాంబినేషన్లో మూవీ కూడా దాదాపు ఖరారైందని సమాచారం. ఈ సినిమాను ఆర్కా మూవీస్ నిర్మించనున్నదని తెలుస్తున్నది.
మలినేని సినిమాతోపాటే ఈ సినిమా షూటింగ్‌ను కూడా ఒకేసారి కానిచ్చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. మరో విషయం ఏంటంటే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే సినిమా ద్వారానే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తున్నది. కథలో ఓ కీలక భూమికను మోక్షజ్ఞ పోషిస్తారట. 30ఏండ్ల క్రితం ఒకేసారి రెండుమూడు సినిమాల్లో నటించేవారు బాలకృష్ణ. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే గొప్ప. అయితే.. బాలయ్య మళ్లీ ైస్టెల్ మార్చారు. పాతరోజుల్ని గుర్తొచ్చేలా పనిచేయాలని నిర్ణయించారు. ఆయన అభిమానులకిది నిజంగా శుభవార్తే.