హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో తనిఖీలకు, కొవిడ్ నిబంధనల అమలు పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసిందని, వాటి పర్యవేక్షణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ సూచనను ధర్మాసనం ఆమోదించింది. కొవిడ్‌పై దాఖలైన పలు వ్యాజ్యాల విచారణ సందర్భంగా కమిటీ ఏర్పాటుచేయాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది.