Baahubali The Eternal War | భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాను ఎవరు అంత ఈజీగా మర్చిపోగలరు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన మెగా విజువల్ వండర్ రెండు భాగాలుగా విడుదలై దేశవ్యాప్తంగా అపారమైన విజయాన్ని సాధించింది. ఇటీవల ఈ సినిమా రెండు భాగాలని ఒకే పార్ట్‌గా థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఆశ్చర్యకరంగా రీ రిలీజ్లో కూడా బాహుబలి మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద కొనసాగింది.ఇదిలా ఉంటే, రాజమౌళి ముందుగానే ప్రకటించినట్టుగా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అనే యానిమేషన్ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. రీ రిలీజ్ సందర్భంగా ఈ సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ను కూడా ప్రదర్శించారు. ఇప్పుడు ఆ టీజర్‌ను అధికారికంగా విడుదల చేయడంతో అభిమానుల్లో హడావుడి మొదలైంది.
టీజర్ రమ్యకృష్ణ (శివగామి) గంభీరమైన వాయిస్‌తో ప్రారంభమవుతుంది. “బాహుబలి మరణం ఒక ముగింపు కాదు… అది ఒక మహా కార్యానికి ప్రారంభం… తన గమ్యం యుద్ధం.”.. ఈ ఒక్క డైలాగ్‌తోనే కథపై ఉత్కంఠ పెరిగిపోయింది. టీజర్లో బాహుబలి మరణం తరువాత అతని ఆత్మ పాతాళ లోకానికి వెళ్లడం, శివలింగం ముందు నృత్యం చేయడం, ఆకాశ లోకంలో దేవతలతో యుద్ధం చేయడం వంటి అద్భుతమైన విజువల్స్ చూపించారు. బాహుబలి కోసం ఇంద్రుడు – విశాసురుడు మధ్య జరిగే భీకర పోరాటం, చివరికి విశాసురుడు ఓడిపోవడం టీజర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ యాక్షన్ సన్నివేశాలు, ఆధ్యాత్మిక టచ్, మైథాలజికల్ థీమ్ — ఇవన్నీ కలగలిపి ఈ సిరీస్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నట్టు కనిపిస్తోంది.
ఈ యానిమేషన్ సిరీస్‌ను ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సిరీస్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అద్భుతమైన విజువల్ టెక్నాలజీతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ అసలు బాహుబలి కథకు కొనసాగింపు కాకుండా, పూర్తిగా కొత్త విశ్వంలో సాగే ఆధ్యాత్మిక – ఫాంటసీ యాక్షన్ యానిమేషన్‌గా ఉండబోతోంది. టీజర్ విడుదలతోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉత్సాహంగా స్పందిస్తున్నారు. “యానిమేషన్ అదిరిపోయింది”, “రాజమౌళి మరో విజువల్ వండర్‌కు శ్రీకారం చుట్టాడు”, “బాహుబలి స్పిరిట్ ఇంకా బతికే ఉంది” అంటూ కామెంట్లు కురుస్తున్నాయి.