Bandla Ganesh | టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు కమెడియన్‌గా సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తర్వాత నిర్మాతగా మారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ల జాబితాలో చేరిపోయారు. ఆ తర్వాత కూడా ఆయన ఎన్నో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ తర్వాత సినిమాల నుండి కొంత విరామం తీసుకొని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. తాజాగా బండ్ల గణేష్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్నారు.
అక్కడ ఆయన కిరణ్ అబ్బవరంని పొగడ్తలతో ముంచెత్తుతూ, “ఇక నిన్ను ఎవరు ఆపలేరు” అని ప్రకటించారు. అదే సమయంలో “నేను బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సినిమాలు ఆపేశాను… త్వరలోనే నిర్మాతగా తిరిగి వస్తాను” అని చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ వ్యాఖ్యలతోనే సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. “బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా రాబోతున్నాడు”, “ఒక స్టార్ హీరో డేట్స్ ఇచ్చాడు” అంటూ ఊహాగానాలు చెలరేగాయి. కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆయన కొత్త సినిమా ఫై ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించారని కూడా రాసాయి.
ఈ వార్తలు ఎక్కువ కావడంతో, బండ్ల గణేష్ స్వయంగా సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. “మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు. ఇంకా సినిమాలు చేయడం పై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. కాబట్టి, ఇలాంటి వార్తలు రాసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. మీకు చేతులెత్తి నమస్కరిస్తూ… విన్నవించుకుంటున్నా.ఇట్లు మీ బండ్ల గణేష్.”అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్లారిటీతో బండ్ల గణేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అభిమానులు ఆయన వినయానికి, సూటిగా ఇచ్చిన స్పష్టతకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా పనులు మొదలు పెట్టకపోయిన, తిరిగి నిర్మాతగా ఎప్పుడు వస్తారో అన్న ఆసక్తి మాత్రం టాలీవుడ్లో పెరుగుతోంది.