Ram Temple : అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించి అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఈ విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిట్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆదివారం అందించింది. ఈ నెల 13న సిట్ ఏర్పాటైంది. ఈ సిట్‌లో లక్నో డీసీ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ రేంజ్ కిరణ్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. అయోధ్య రామాలయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోంది.
ఈ రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల్ని దారి మళ్లించడం, దేవాలయ ట్రస్ట్ అకౌంట్లో జమ చేయకపోవడం వంటి అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కొన్ని అవకతవకలు జరిగినట్లు సిట్ గుర్తించింది. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, రాళ్లు, వజ్రాలు వంటి వాటికి సంబంధించి డాక్యుమెంట్లలో తేడాలున్నట్లు సిట్ తేల్చింది. ఈ అంశంపై పలువురు అధికారుల్ని సిట్ విచారించింది. అనేక ఆధారాల్ని సేకరించింది. ఈ అంశంలో సిట్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు చెప్పలేదు. ఆభరణాల నిర్వహణ, నిల్వ, లెక్కలు వంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదని తేలింది. ముఖ్యంగా గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో జరిగిన కుంభమేళా సందర్భంగా వచ్చిన కానుకల్లో చాలా అవకతవకలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ రెండు నెలల కాలంలోనే ఇక్కడికి దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ సమయంలో హుండీలు, విరాళాలు సమర్పించే బాక్సులు గంటల వ్యవధిలోనే నిండిపోయాయి. భారీ ఎత్తున నగదు, ఆభరణాలు జమయ్యాయి.
ఇలా భారీ విరాళాలు రావడంతో కొందరు అధికారులు వీటి విషయంలో కక్కుర్తి పడ్డట్లు సమాచారం. దేవాలయానికి జమ చేయకుండా కాజేసినట్లు అనుమానాలున్నాయి. ఈ అంశాలన్నింటిపై విచారణ జరుగుతోంది. ఇందులో అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాత్రపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యలో ఈ ఆలయ ట్రస్ట్‌కు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది ఎవరూ అయోధ్య దాటి వెళ్లకూడదని సిట్ అధికారులు ఆదేశించారు. మరోవైపు ఈ అంశంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు.