పాట్నా: ఒకే స్కూల్లో చదివిన ఒక జంట చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత తమ ఇళ్ల నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి కుటుంబం ఫిర్యాదుతో ఆ జంట ఆచూకీని పోలీసులు గుర్తించి తీసుకువచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన యువకుడు తన భార్య అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు. (Woman Killed By Brother) అయితే ఆమె సోదరుడే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోసాయిపూర్ గ్రామానికి చెందిన సుజాత, ఘన్సౌత్ గ్రామంలోని తాత, అమ్మమ్మ ఇంటిలో నివసించింది. ఆ గ్రామానికి చెందిన గౌరీ శంకర్, ఆ బాలిక కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. 2020లో వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆరేళ్లపాటు వారి ప్రేమ సంబంధం కొనసాగింది.
కాగా, ఈ ఏడాది జనవరిలో సుజాతకు 19 ఏళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 22 ఏళ్ల గౌరీ శంకర్, ఆమె కలిసి జనవరి 18న తమ ఇళ్ల నుంచి పారిపోయారు. సమస్తిపూర్లోని ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నారు. జనవరి 20న ఆ జంట హర్యానా వెళ్లింది. అక్కడ భార్యాభర్తలుగా కలిసి జీవించసాగారు.
మరోవైపు సుజాత అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముజఫర్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ జంట హర్యానాలో ఉన్నట్లు గుర్తించారు. ఫిబ్రవరి 11న అక్కడ అదుపులోకి తీసుకుని ముజఫర్‌పూర్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.
అయితే తాను మేజర్ అని, ఇష్టపూర్వకంగానే గౌరీ శంకర్‌ను పెళ్లి చేసుకున్నట్లు సుజాత కోర్టుకు తెలిపింది. తన భర్తతో కలిసి జీవించాలనుకుంటున్నట్లు చెప్పింది. అయినప్పటికీ గౌరీ శంకర్‌ను జైలుకు పంపారు. బంధువైన మహిళకు సుజాత సంరక్షణను పోలీసులు అప్పగించారు.
కొన్ని రోజుల తర్వాత గౌరీ శంకర్ జైలు నుంచి విడుదలయ్యాడు. మార్చి 31న చివరిగా సుజాతతో అతడు మాట్లాడాడు. ఆ తర్వాత తన భార్య గురించి తెలియకపోవడంతో ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు అనుమానించాడు. తన భార్య అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అతడు ఆరోపించాడు. తాను ఆత్మహత్యకు పాల్పడతానంటూ ఒక వీడియోలో హెచ్చరించాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ముజఫర్‌పూర్ పోలీసులు స్పందించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. గౌరీ శంకర్ నుంచి అధికారికంగా ఫిర్యాదును స్వీకరించారు. సుజాత కోసం గాలింపు ప్రారంభించారు. ఆచూకీ లభించకపోవడంతో ఆమె సోదరుడు అభిషేక్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కులాంతర వివాహంపై ఆగ్రహించిన సుజాత కుటుంబం ఆమెను హత్య చేసినట్లు విచారణలో బయటపడింది.
అయితే హోలీ పండుగ రోజున బంధువు ఇంటికి వచ్చిన తల్లి సుజాతను ఒప్పించి ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత పథకం ప్రకారం సోదరుడు అభిషేక్ తన కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి సుజాత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని దహనం చేశారు. ఇది తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. సుజాత హత్యపై కేసు నమోదు చేశారు. సోదరుడు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.