హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలు వినియోగించి తమ పొట్టకొట్టొద్దని ఆటో సంఘాల జేఏసీ నాయకులు బస్సుభవన్ ఎదుట శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో ఫస్ట్ మైల్.. లాస్ట్ మైల్ కనెక్టివిటీ సేవల్లో భాగంగా ఈవీ ఆటోల వినియోగానికి ప్రభుత్వం సానుకూలంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన చర్చల్లో ఆర్టీసీలో ఈవీ ఆటోల వినియోగం ఉండదని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనపై చర్చలకు రమ్మనడం అన్యాయమని అన్నారు. నిరసన అనంతరం ఆటో యూనియన్ నాయకులతో ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు సమావేశం నిర్వహించారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య బెంబేలెత్తిస్తున్నదని, ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. కనెక్టివిటీ సేవలతో వారికి ప్రయాణ సమయం ఆదా అవుతున్నదని తెలిపారు. అధికారుల సూచనలను ఆటో యూనియన్ నాయకులు వ్యతిరేకించారు. ఆటోడ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతుందని, ఇప్పటికే ఉచిత బస్సుతో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీ ఆటోల వినియోగాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్షేమబోర్డు ఏర్పాటుతోపాటు ఆటోడ్రైవర్లకు హామీ ఇచ్చిన ఏడాదికి రూ. 12 వేలు చెల్లించాలని కోరారు.