హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఏండ్లుగా సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు తమ హకుల సాధనకు పోరుబాట పట్టారు. కొన్నేండ్లుగా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యవేదిక ఈ నెల 8న ‘చలో అసెంబ్లీ’ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2017, 2021 వేతన సవరణ (పీఆర్సీ) ఎరియర్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, చివరి నెలజీతంవంటి అన్ని బకాయిలు కలిపి యాజమాన్యం సుమారు రూ. 2,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. బకాయిలు అందక, అప్పులు తీర్చలేక, పిల్లల పెండ్లిళ్లు చేయలేక ఇప్పటికే 300 మందికిపైగా విశ్రాంత ఉద్యోగులు కన్నుమూశారని, వారి కుటుంబాలకు కూడా ఇప్పటివరకు ఒక రూపాయి చెల్లించలేదని వాపోయారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 8న శాంతియుత ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు.