ఖాతా తెరవక ముందే రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థి భారీ స్కోరుకు బాటలు వేసిన డేవిడ్ వార్నర్.. ఫుల్ జోష్‌లో పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్న సమయంలో తన తొందరపాటుతో అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు! తప్పుల మీద తప్పులు చేసిన ఆసీస్ మూల్యం చెల్లించుకోక తప్పదనుకుంటున్న సమయంలో మిడిలార్డర్లో స్టోయినిస్, మాథ్యూ వేడ్ పరుగుల సునామీ సృష్టించడంతో ఆస్ట్రేలియా అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టిన పాక్.. ఆఖర్లో ఒత్తిడికి గురై ఉత్తచేతులతో ఇంటిబాట పట్టింది. ఆదివారం జరుగనున్న మెగా ఫైనల్లో ఎవరు నెగ్గినా.. క్రికెట్ ప్రపంచం కొత్త చాంపియన్‌ను చూడనుంది!
దుబాయ్: ఒత్తిడిని జయించడంలో.. తమని జగజ్జేతలని ఎందుకు అంటారో కంగారూలు మరోసారి నిరూపించారు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో చివరి వరకు నమ్మకాన్ని కోల్పోని ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వన్డేల్లో ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచిన ఆసీస్.. పొట్టి ఫార్మాట్లో రెండో సారి తుదిపోరుకు చేరింది. గురువారం ఇక్కడి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆదివారం జరుగనున్న మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆసీస్ అమీతుమీ తేల్చుకోనుంది. రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలువకపోవడంతో క్రికెట్ ప్రేమికులు కొత్త చాంపియన్‌ను చూడనున్నారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫఖర్ జమన్ (32 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (39; 5 ఫోర్లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ రెండు.. కమిన్స్, జంపా చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభంలో మెరుపులు మెరిపిస్తే.. మార్కస్ స్టొయినిస్ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ ఆటగాళ్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. ఆఖర్లో పిడుగుల్లాంటి షాట్లతో కంగారూలను గెలిపించిన మాథ్యూ వేడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియాకిది ఐదో విజయం.
పాకిస్థాన్: 20 ఓవర్లలో 176/4 (రిజ్వాన్ 67, ఫఖర్ 55 నాటౌట్; స్టార్క్ 2/38), ఆస్ట్రేలియా: 19 ఓవర్లలో 177/5 (వార్నర్ 49, వేడ్ 41 నాటౌట్; షాదాబ్ 4/26).