ఐడీఎస్ అనేది ఓ ఐటీ సంస్థ. ధీరజ్ అగర్వాల్ ఆ కంపెనీ మేనేజర్. రాఫెల్ ముడుపుల వ్యవహారంలో ఈ ఐడీఎస్ పాత్ర బయటపడింది. ఈ సంస్థ ద్వారానే సుశేన్ గుప్తా అనే మధ్యవర్తికి దసాల్ట్ ఏవియేషన్ ముడుపుల్లో కొంతమేర పంపంది. ఐడీఎస్కు చెల్లించిన సొమ్ములో 40 శాతాన్ని మారిషస్‌లో ఉన్న సుశేన్ గుప్తా డొల్ల కంపెనీకి బదలాయించారు. ఈ మేరకు ఐడీఎస్తో దసాల్ట్ ఒప్పందం చేసుకున్నది. ఈ అక్రమ లావాదేవీలకు ఆధారాలు సీబీఐ దగ్గర ఉన్నా దర్యాప్తు చేయలేదు. వాటిని మరుగునపరచేసింది. ఫ్రెంచ్ పోర్టల్ ‘మీడియాపార్ట్’ తాజా నివేదిక, తర్వాత బయటికొస్తున్న విషయాలతో రాఫెల్ డొంక కదులుతున్నది.
సుశేన్ గుప్తాకు దసాల్ట్ ఏవియేషన్ ముడుపులు అందడానికి సంబంధించి అక్టోబర్ 2018 నుంచి సీబీఐ, ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయని ‘మీడియాపార్ట్’ నివేదిక బయటపెట్టింది. అయినా వాటిపై దర్యాప్తు చేయకూడదని సీబీఐ, ఈడీ నిర్ణయించాయని ఆరోపించింది. విదేశాల్లో డొల్ల కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు, నకిలీ ఇన్వాయిస్లతో ముడుపులు చేతులు మారాయని వెల్లడించింది. ఈ రహస్య కమిషన్ల చెల్లింపులకు సంబంధించిన నకిలీ ఇన్వాయిస్లను ప్రచురించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 9: రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌లో ముడుపుల వ్యవహారం మళ్లీ రాజకీయ దుమారం రేపుతున్నది. ఫ్రాన్స్‌కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ నుంచి రూ.56 వేల కోట్లతో 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు 2016లో మోదీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దసాల్ట్ ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు మధ్యవర్తికి 13 మిలియన్ యూరోలు (రూ.110 కోట్లు) ముడుపులు సమర్పించిందని పరిశోధనాత్మక వార్తలు రాసే ఫ్రెంచ్ పోర్టల్ ‘మీడియాపార్ట్’ సోమవారం ప్రచురించిన రిపోర్ట్‌లో బయటపెట్టింది.
దీనికి ఆధారాలు ఉన్నా సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేయలేదని ఆరోపించింది. అయితే ఈ వ్యవహారం మంగళవారం మరో మలుపు తిరిగింది. రాఫెల్ ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయని తెలిపే మరికొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నా వాటిని సీబీఐ విస్మరించిందని, దర్యాప్తు చేయలేదని గుర్తించినట్టు ఎన్డీటీవీ పేర్కొంది. ఆ డాక్యుమెంట్లలో ఒకటి- ఐడీఎస్ అనే ఐటీ సర్వీసుల కంపెనీ అప్పటి మేనేజర్ ధీరజ్ అగర్వాల్ స్టేట్మెంట్.
ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా అతని స్టేట్మెంట్ను సీబీఐ రికార్డ్ చేసింది. ఆ సందర్భంగా దసాల్ట్ వ్యవహారం బయటపడింది. మధ్యవర్తి అయిన సుశేన్ గుప్తాకు మారిషస్‌లో ఇంటర్స్టెల్లార్ అనే డొల్ల కంపెనీ ఉండేదని, దానికి ఐడీఎస్ ద్వారానే దసాల్ట్ ఏవియేషన్ ముడుపులు చెల్లించిందని అగర్వాల్ తెలిపాడు. దసాల్ట్ నుంచి ఇంటర్‌స్టెల్లార్‌కు రూ.4.15 కోట్లు మళ్లించేందుకు ఐడీఎస్ ఉపయోగపడిందని ఒప్పుకున్నాడు. ఈ విషయాలు చార్జిషీట్లో ఉన్నా సీబీఐ పట్టించుకోలేదని, దర్యాప్తు జోలికి వెళ్లలేదని ఎన్డీటీవీ పేర్కొంది.
రాఫెల్ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందని 2018 అక్టోబర్ 4న ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, మరో సీనియర్ న్యాయవాది సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే 2018అక్టోబర్ 23న ఆకస్మికంగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు గురయ్యారు. ఇది రాఫెల్‌ను వ్యవహారాన్ని కప్పెట్టయ్యడానికి జరిగిన కుట్ర అని ఆరోపణలు వచ్చాయి. కమీషన్లు, అవినీతికి సంబంధించిన ఆధారాలపై మూడేండ్ల పాటు మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉండిపోయిందని కాంగ్రెస్ ప్రశ్న. రాఫెల్ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు చేయించాలన్న డిమాండ్‌ను ఆ పార్టీ మళ్లీ తెరపైకి తెచ్చింది.