సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మౌలిక సౌకర్యాలను సమున్నత స్థాయికి తీసుకువెళ్లే ఎస్ఆర్డీపీ ఫలాలను విడతల వారీగా సర్కారు అందిస్తున్నది. అయితే, ఈ వంతెనలో నిర్మాణంలో భాగంగా ఏళ్ల తరబడి సమస్యలకు పరిష్కారం దొరుకుతుండటంతో స్థానికులకు మహా ఉపశమనం లభిస్తున్నది. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు, రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు బై-డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి) నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టింది.
రెండు దశల్లో పనులను పూర్తి చేసేందుకు రూ.426 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మొదటి దశలో రూ.350 కోట్లతో ఇందిరా పార్కు చౌరస్తా, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు 2.631 కిలోమీటర్ల పొడవుతో 16.61 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణం పనులు జరుగుతుండగా, ఇక్కడే అశోక్‌నగర్ బ్రిడ్జి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ విస్తరణ పనులతో సమీప ప్రాంతాల వాసులకు వరద ముంపు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
దీంతో స్థానికుల నుంచి ప్రభుత్వానికి కృతజ్ఞతల వెల్లువ కొనసాగుతున్నది. అశోక్‌నగర్ బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా వరద ముంపు సాఫీగా జరుగుతుందని, భారీ వర్షాలు కురిసినా నాలా పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు ఉండదని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 25 యేండ్లుగా పరిష్కారం కాని సమస్యలకు మంత్రి కేటీఆర్ చొరవ చూపడంతో తమ కష్టాలు తీరుతున్నాయని స్థానికులు చెబుకోవటం కనిపించింది.