ఆషాఢ మాసంలో విష్ణసహస్ర నామ పారాయణం చేయాలని పూర్వికుల మాట. ఇదే సమయంలో అమ్మవారికి సంబంధించిన వారాహీ గుప్త నవరాత్రులు జరగడంతోపాటు ఆషాఢమంతా అమ్మవారికి సంబంధించిన మాసమే కావడంతో బోనాలతో పాటు పలు ప్రాంతాల్లో లలితా సహస్ర పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ రెండు సహస్రనామాలు పారాయణం చేయడం కేవలం భక్తి కోసమే కాదు.. ఆధునిక ప్రపంచంలో భక్తిభావన ఎంత ముఖ్యమో అదే విధంగా సహస్రనామాల్లో అంతర్లీనంగా ఉన్న శాస్త్ర విశేషాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో విష్ణు సహస్ర నామం, లలితా సహస్ర నామం విశిష్ఠ స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు సహస్రనామాలు కేవలం భక్తి సాహిత్యం మాత్రమే కాకుండా విశ్వస్వరూపం, చైతన్యం, కాలం, శబ్దం, ధ్యానం వంటి అనేక శాస్త్రీయ తాత్విక అంశాలను వివరిస్తాయి. విష్ణు సహస్రనామం మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన అత్యంత పవిత్రమైన స్తోత్రం. లలితా సహస్రనామం శాక్తేయ సంప్రదాయంలో ప్రధానమైన బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలోనిది. ఇది ప్రసిద్ధి చెందిన అమ్మవారి సహస్రనామాలతో కూడిన శ్రీవిద్యామంత్రరాజం. ఈ రెండు స్తోత్రాలు భిన్న ఆరాధనా సంప్రదాయాలకు చెందినవైనప్పటికీ, శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా పలు అంశాలపై లోతైన తాత్విక దృష్టిని, విజ్ఞానాన్ని అందిస్తాయి. విష్ణు, లలితా సహస్రనామాలను కేవలం స్తోత్రాలుగా మాత్రమే చూడకుండా భారతీయ రుషుల అద్భుతమైన తాత్విక-శాస్త్రీయ ఆలోచనల నిధిగా అధ్యయనం చేస్తే విశ్వం, జీవితం, విజ్ఞానం, మేధస్సు, మనసుల గురించిన కొత్త దృక్కోణం కనిపిస్తుంది.
ఆధునిక కాలంలోని కొందరు పరిశోధకులు, పండితులు విష్ణు, లలితా సహస్రనామ స్తోత్రాలలోని భావనలను క్వాంటం ఫిజిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాస్మాలజీ, న్యూరోసైన్స్, సైకాలజీ వంటి శాస్ర్తాలతో పోల్చి అధ్యయనం చేస్తున్నారు. లలితా, విష్ణు సహస్రనామాల్లో ప్రతీ నామం ఒక నిర్దుష్టమైన లయ, స్వరంతో ఉంటాయి. టోనోస్కోప్ వంటి ఆధునిక పరికరాలతో పరీక్షించినప్పుడు వచ్చిన ప్రకంపనలను పరిశీలిస్తే ఈ నామాలను ఉచ్చరించినప్పుడు ఉత్పన్నమయ్యే ధ్వని తరంగాలు మెదడులోని నాడులను ఉత్తేజపరుస్తున్నాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి పఠించడం వల్ల శ్వాస నియంత్రణలో ఉండటమే కాక, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసి తద్వారా శరీరం ఆరోగ్యకరంగా మారుతున్నదని వాళ్లు గుర్తించారు. కొందరు విద్యార్థులు ఈ నామాలను క్రమం తప్పకుండా చదవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతున్నాయని భారతీయ వైద్య పరిశోధనామండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనం తేల్చి చెప్పింది. జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ మెడిసిన్ వారి పరిశోధనలో సహస్ర నామాలు పఠించే సమయంలో క్రమబద్ధమైన ఉచ్చాస నిశ్వాసల ద్వారా గుండె పనితీరు మెరుగుపడడంతోపాటు రక్తపోటు అదుపులో ఉండటాన్ని గమనించారు. ఇప్పటికే ఈ రెండు సహస్రనామాలపై చాలా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యం తదితర కోణాల్లో విష్ణు, లలితా నామాలపై లోతైన అధ్యయనం చేయాలని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నేటి యువత సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ, ఒత్తిడి, ఆందోళన, లక్ష్యసాధనలో అయోమయం, ఏకాగ్రత లోపం వంటి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో సహస్ర నామాల పారాయణం మనసును ఒక నిర్దేశిత లక్ష్యంపై దృష్టి నిలిపే సాధన కాగా చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. జీవితంలో కీలక నిర్ణయాలు స్పష్టంగా తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. నియమానుసారం పారాయణం, భగవత్ ధ్యానం మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. తద్వారా వ్యక్తిగతంగా ఆందోళన తగ్గడమే కాకుండా భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ సహస్ర నామాలను ప్రతీరోజూ ఒకే సమయంలో పారాయణం చేస్తే సమయపాలన, క్రమశిక్షణ అలవడుతుంది. లలితా విషు ్ణసహస్ర నామాలు కేవలం భక్తి పరంగానే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. ఇవి కేవలం పూజ కోసం మాత్రమే కాకుండా జీవితాన్ని ఎలా గడపాలి, మనసును ఎలా నియంత్రించాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే విషయాలను కూడా బోధిస్తాయి.

విష్ణు సహస్ర నామం ‘విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః’తో మొదలవుతుంది. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించిన చైతన్యం. ఆధునిక శాస్త్రం చైతన్య స్వరూపాన్ని ఇంకా పూర్తిగా వివరించలేదు. సహస్రనామం మాత్రం విశ్వమంతా ఒకే చైతన్య సూత్రంతో అనుసంధానమై ఉందని తాత్వికంగా వివరిస్తుంది. ‘భూతభవ్యభవత్ప్రభుః’ అంటే గతం, వర్తమానం, భవిష్యత్ అన్నీ ఏకమై ఉన్నాయని ఈ నామం సూచిస్తుంది. కాలం విశ్వనిర్మాణంలో ప్రాథమిక అంశమని ఆధునిక భౌతికశాస్త్రం కూడా చెబుతుంది. అలాగే విష్ణువును సహస్రనామాల్లో భాగంగా ‘సహస్రాంశుః, ఆదిత్యోజ్యోతిరాదిత్యః’ అని వేర్వేరుచోట్ల ప్రస్తుతిస్తాం. సూర్యుడు, నక్షత్రాలు, ప్రకాశం, విశ్వవ్యాప్తం శక్తి వంటి భావనలను ఈ నామాలు ప్రతిబింబిస్తాయి.
లలితా సహస్ర నామం మొదట్లోనే ‘చిదగ్నికుండసంభూతా’ అంటూ అమ్మవారిని ఆరాధిస్తాం. చైతన్యాగ్ని నుంచి సృష్టి ఉద్భవించిందని ఈ నామం సూచిస్తుంది. ఆధునిక భౌతికశాస్త్రంలో విశ్వం అత్యంత శక్తిమంతమైన ప్రారంభ స్థితి నుంచి విస్తరించిందనే సిద్ధాంతాన్ని చిదగ్నికుండసంభూతా గుర్తుచేస్తుంది. ఇది బిగ్బ్యాంగ్కు ప్రత్యక్ష శాస్త్రీయ వివరణ కాకపోయినా సృష్టి ఒక మూలశక్తి నుంచి ఉద్భవించిందనే తాత్విక భావనను ప్రతిబింబిస్తుంది. లలితా అమ్మవారిని ‘నాదరూపా’ ‘మంత్రిణీ’ అంటూ వేర్వేరు చోట్ల సహస్రనామాల్లో పఠిస్తాం. సృష్టికి మూలం నాదమని భారతీయ తత్వం చెబుతుంది. ఆధునిక విజ్ఞానంలో కూడా ధ్వని, తరంగాలు, కంపనాలు ప్రకృతిలో కీలకపాత్ర పోషిస్తాయి. మంత్రోచ్చరణ మనసు, శ్వాస, ఏకాగ్రతపై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ‘మనోరూపేక్షుకోదండా’ అంటే మనసే ప్రధానశక్తి అని ఈ నామం చెబుతుండగా… ఆధునిక మనో విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆలోచనలు, భావోద్వేగాలు, ఏకాగ్రత మనిషి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.
భారతీయ సంస్కృతిలో సహస్రనామం అంటే దైవానికి చెందిన వెయ్యినామాల సమాహారం. ప్రతీనామం ఒక తాత్విక భావాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని లేదా విశ్వస్వరూపంలోని ఒక కోణాన్ని సూచిస్తుంది. లలితా సహస్ర నామం శక్తి స్వరూపాన్ని, విష్ణు సహస్ర నామం చైతన్య స్వరూపాన్ని బోధిస్తాయి. శక్తి-చైతన్య సమన్వయమే విశ్వానికి ఆధారం అనే భావన ఈ రెండు మహా మంత్రరాజాల హృదయం. లలితాంబిక శక్తిని వివరిస్తే, విష్ణు సహస్రం పరమాత్మ స్వరూపాన్ని వివరిస్తుంది. శక్తి లేకుండా పదార్థం పనిచేయదు అదేవిధంగా పదార్థం లేకుండా శక్తి వ్యక్తం కాదు. లలిత, విష్ణు సహస్రనామాల పారాయణం ఆధ్యాత్మికంగా ప్రశాంతతను అందిస్తూనే శాస్త్రీయంగా వ్యక్తిత్వవికాసానికి, సంపూర్ణారోగ్యానికి దోహదం చేస్తాయని ఆధునిక శాస్త్రపరిశోధనలు నిరూపిస్తున్నాయి.