అధికారులతో కలెక్టర్ హరీశ్ ప్రత్యేక సమావేశం
మేడ్చల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 26న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. హకీంపేట్ ఎయిర్పోర్టును శనివారం కలెక్టర్ హరీశ్, ప్రొటోకాల్ అడిషనల్ సెక్రటరీ అరవింద్ సింగ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి నరేంద్రవర్మ, వింగ్ కమాండర్ చౌదరి, పంకజ్ జైన్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సోమవారం సాయంత్రం 4:15 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో రానున్నందున అందుకు సంబంధించి ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం ల్యాండింగ్, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలు, ప్రొటోకాల్ వివరాలను అధికారులతో చర్చించారు. రాష్ట్రపతి హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే గౌరవ వందనం, స్వాగతం పలుకడం, పుష్పగుచ్ఛాలు అందించేందుకు పరిమిత సంఖ్యలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. ఏర్పాట్లపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించామని చెప్పారు. రాష్ట్రపతిని కలిసిందుకు వీఐపీలు వస్తారని, ఎయిర్పోర్ట్ ఆవరణలో షామియానాలు(టెంట్లు)కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఎయిర్పోర్ట్ ప్రొటోకాల్ అసిస్టెంట్ సెక్రటరీ శశిధర్రెడ్డి, నోడల్ అధికారి రవి, డీసీపీ సందీప్, అధికారులు శ్రీనివాసమూర్తి, ఏసీసీ రామలింగరాజు, జానకిరామ్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.