Chandrababu | నెల్లూరు జిల్లా గూడ్లూరు మండలం దరకనిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. లక్ష్మీనాయుడు హత్య అమానవీయం, అమానుషమని విమర్శించారు. ఈ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సచివాలయంలో మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాలన్నారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.
లక్ష్మీ నాయుడు కుటుంబానికి ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించారు. లక్ష్మీనాయుడి భార్యకు రెండెకరాల భూమితో పాటు రూ.5 లక్షల నగదు, ఇద్దరు పిల్లలకు రెండెకరాల చొప్పున భూమితో పాటు రూ.5 లక్షల చొప్పున నగదు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లక్ష్మీనాయుడి పిల్లల్ని చదివించే బాధ్యత తమ ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. ఇక కారు దాడిలో గాయపడిన పవన్‌కు నాలుగెకరాలు, రూ.5లక్షల నగదును, భార్గవ్‌కు రూ.3లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఇక లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించారు. కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ఆదేశించారు.