బాలీవుడ్ చిత్రసీమలో గత కొంతకాలంగా జీవితకథా చిత్రాల (బయోపిక్స్) ట్రెండ్ ఊపందుకుంది. సమాజంపై బలమైన ప్రభావం చూపించిన వివిధరంగాలకు చెందిన వ్యక్తుల జీవిత కథలు వెండితెర దృశ్యమానమవుతున్నాయి. తాజాగా అనుష్కశర్మ..భారతీయ మహిళా క్రికెట్లో బౌలింగ్ దిగ్గజంగా పేరు పొందిన జులాన్ గోస్వామి బయోపిక్‌లో నటించనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఈ భామ సాధన చేయడం మొదలుపెట్టింది. ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు ప్రోసిత్రాయ్ దర్శకత్వం వహించనున్నారు. స్వీయ నిర్మాణ సంస్థ క్లీన్‌స్లేట్ ఫిల్మ్స్ పతాకంపై అనుష్కశర్మ తెరకెక్కించబోతున్నది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘భారత మహిళా క్రికెట్ తొలితరం క్రీడాకారిణిగా జులాన్ గోస్వామి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. మహిళలు క్రికెట్లోకి అడుగుపెట్టే స్వేచ్ఛలేని రోజుల్లోనే ఆమె ధైర్యంగా ముందడుగువేసింది. జులాన్ గోస్వామి క్రికెట్ ప్రస్థానాన్ని, ఆటుపోట్లను ఆవిష్కరిస్తూ ఈ బయోపిక్‌ను రూపొందిస్తాం’ అని చెప్పింది. ఈ ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రాని సెట్స్‌మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.