ఐపీఎల్ ప్రారంభమై దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో పరాజయం ఎదురైంది. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ.. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో మొదట ముంబై ఓ మోస్తరు స్కోరు చేసినా.. ఆఖర్లో మహేంద్రజాలంతో రోహిత్ సేనకు వరుసగా ఏడో ఓటమి తప్పలేదు!
చెన్నై విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో.. ఉనాద్కట్ వేసిన తొలి బంతికి ప్రిటోరియస్ ఔట్ కాగా.. రెండో బంతికి బ్రేవో సింగిల్ తీసి ధోనీకి స్ట్రయికింగ్ ఇచ్చాడు. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 16 పరుగులకు చేరగా.. వింటేజ్ మహీని గుర్తు చేస్తూ మాజీ కెప్టెన్ చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్ తల మీదుగా భారీ సిక్సర్ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్‌కు ఫైన్ లెగ్ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్‌కు ఫోర్ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ముగింపునిచ్చాడు!
ముంబై: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ మునుపటి మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 15వ సీజన్లో రెండో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో చెన్నై 3 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. వరుసగా ఏడో మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలకు అనధికారికంగా దూరమైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్), అరంగేట్ర ఆటగాడు హృతిక్ షోకీన్ (25) ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), బ్రేవిస్ (4) విఫలమవడంతో ఒక దశలో ముంబై 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు ముఖేశ్ చౌదరీ (3/19) ఖాతాలోకే వెళ్లడం విశేషం.
చెన్నై ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు నేలపాలు చేయగా.. బ్రేవో రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగగా.. అంబటి రాయుడు (40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప (30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో ధోనీ (13 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), ప్రిటోరియస్ (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టడంతో చెన్నై చిందేసింది. ముంబై బౌలర్లలో డానియల్ సామ్స్ 4, ఉనాద్కట్ రెండు వికెట్లు పడగొట్టారు. ముఖేశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీతో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకొని.. తాజా వేలం ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన తెలంగాణ యువ ఆల్‌రౌండర్ తిలక్ వర్మ అద్వితీయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. తాజా సీజన్లో ఇప్పటికే ఒక అర్ధశతకాన్ని తన పేరిట రాసుకొని.. కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లతో అలరించిన తిలక్.. గురువారం సంయమనంతో కూడిన దూకుడుతో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లు ముగియకముందే ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరిన సమయంలో బరిలోకి దిగిన తిలక్.. చివరి బంతి వరకు క్రీజులో నిలిచి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు.
ఈ సీజన్లో టచ్ దొరక్క ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ రెండో బంతికి మిడాన్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. మూడు బంతుల తర్వాత ఇషాన్ కిషన్ క్లీన్ బౌైల్డె సారథిని అనుసరించాడు. మూడో ఓవర్లో బ్రేవిస్.. కీపర్ ధోనీకి దొరికిపోగా.. ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్‌ను శాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి ముంబై 49/4తో నిలిచింది. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు హృతిక్ షోకీన్‌తో కలిసి తిలక్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
ఆరంభంలో ఆచితూచి ఆడిన తిలక్.. జడేజా ఓవర్లో చూడ చక్కటి సిక్సర్‌తో అలరించాడు. ఈక్రమంలో హృతిక్ ఔట్ కాగా.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పొలార్డ్ (14) నిరాశ పరిచాడు. అడపాదడపా బౌండ్రీలు బాదుతూ వచ్చిన తిలక్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో జైదేవ్ ఉనాద్కట్ (19 నాటౌట్) కొన్ని విలువైన పరుగలు జోడించడంతో ముంబై మంచి స్కోరు చేయగలిగింది.
ముంబై: రోహిత్ (సి) శాంట్నర్ (బి) ముఖేశ్ 0, ఇషాన్ (బి) ముఖేశ్ 0, బ్రేవిస్ (సి) ధోనీ (బి) ముఖేశ్ 4, సూర్యకుమార్ (సి) ముఖేశ్ (బి) శాంట్నర్ 32, తిలక్ వర్మ (నాటౌట్) 51, హృతిక్ (సి) ఊతప్ప (బి) బ్రేవో 25, పొలార్డ్ (సి) దూబే (బి) తీక్షణ 14, సామ్స్ (ఎల్బీ) బ్రేవో 5, ఉనాద్కట్ (నాటౌట్) 19, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 155/7. వికెట్ల పతనం: 1-0, 2-2, 3-23, 4-47, 5-85, 6-111, 7-120, బౌలింగ్: ముఖేశ్ చౌదరి 3-0-19-3, శాంట్నర్ 3-0-16-1, తీక్షణ 4-0-35-1, జడేజా 4-0-30-0, ప్రిటోరియస్ 2-0-17-0, బ్రేవో 4-0-36-2.
చెన్నై: గైక్వాడ్ (సి) తిలక్ వర్మ (బి) సామ్స్ 0, ఊతప్ప (సి) బ్రేవిస్ (బి) ఉనాద్కట్ 30, శాంట్నర్ (సి) ఉనాద్కట్ (బి) సామ్స్ 11, రాయుడు (సి) పొలార్డ్ (బి) సామ్స్ 40, దూబే (సి) ఇషాన్ (బి) సామ్స్ 13, జడేజా (సి) తిలక్ వర్మ (బి) మెరిడిత్ 3, ధోనీ (నాటౌట్) 28, ప్రిటోరియస్ (ఎల్బీ) ఉనాద్కట్ 22, బ్రేవో (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 156/7. వికెట్ల పతనం: 1-0, 2-16, 3-66, 4-88, 5-102, 6-106, 7-139, బౌలింగ్: సామ్స్ 4-0-30-4, బుమ్రా 4-0-29-0, మెరిడిత్ 4-0-25-1, ఉనాద్కట్ 4-0-48-2, హృతిక్ 4-0-23-0.