అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన విభిన్న ప్రేమకథాచిత్రం ‘లవ్ ఓటిపి’. జాన్విక, స్వరూపిణి కథానాయికలు. విజయ్ ఎం.రెడ్డి నిర్మాత. ఒకరికి తెలీకుండా, మరొకరిని.. ఇలా ఇద్దరమ్మాయిల్ని ఒకేసారి ప్రేమించి ఇబ్బందుల్లో పడ్డ అబ్బాయి కథతో ఈ సినిమా తెరకెక్కింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా సంబంధించి ప్రీమియర్స్ షోలు ఇవాళ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా..
అక్షయ్(అనీష్) ఒక సాధారణ జీవితం గడిపే సరదా కుర్రాడు. ఆయనకు స్ట్రిక్ట్ పోలీస్ ఫాదర్.. అతి గారాబం చేసే తల్లి, ప్రాణమిచ్చే ఫ్రెండ్ ఉంటారు. అక్షయ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతా సాఫీగా సాగుతున్న అక్షయ్ లైఫ్‌లోకి సనా వస్తుంది. మొదట్లో స్నేహంగా ఉన్నా సనా తనను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించి అక్షయ్‌ను రిలేషన్‌షిప్‌లోకి లాగుతుంది. దీంతో అక్షయ్ జీవితం నరకమవుతుంది. ఆ తర్వాత అక్షయ్‌కు నక్షత్ర (ఫిజియోథెరపిస్ట్) పరిచయమవుతుంది. ఆమె శాంతంగా, అర్థం చేసుకునే మనస్తత్వంతో ఉంటుంది. సనాకు పూర్తిగా విరుద్ధంగా.. అక్షయ్ గందరగోళంలో ఆమె ఒక ప్రశాంతతగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. అక్షయ్ తండ్రి శంకర్ ప్రేమకు పూర్తి వ్యతిరేకి. కొడుకు ఫోన్‌ను కూడా తరచుగా చెక్ చేస్తూ ఉంటాడు. అదే టైమ్‌లో అక్షయ్ ప్రేమ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సనా పెట్టిన లవ్ ట్రాప్ నుంచి అక్షయ్ తప్పించుకుంటాడా? నక్షత్రతో ఆయనకు సంతోషకరమైన పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాకు హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా అనీష్నే. యూత్‌కు చాలా కనెక్ట్ అయ్యేలా అనీష్ కథ రాసుకున్నాడు. ముఖ్యంగా కామెడీ ట్రాక్ బాగా రాసుకున్నాడు. అక్షయ్ అతని స్నేహితుల మధ్య వచ్చే సరదా గొడవలు సినిమాకు హైలెట్ అనే చెప్పాలి. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం.. సనాతో టాక్సిక్ లవ్ స్టోరీ.. క్రికెట్ సీన్లు ఇలా చాలా ఎపిసోడ్స్ ఫస్టాఫ్‌లో మంచి ఎంటర్టైన్ చేశాయి. అయితే అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ మధ్య డ్రామా కొత్తగా అనిపించింది. చివరలో మంచి నోట్‌తో సినిమాను ఎండ్ చేశారు. చాలావరకు సన్నివేశాలు చూసినట్లే అనిపిస్తాయి.
స్క్రీన్‌ప్లేపై మరింత ఫోకస్ చేయాల్సింది. సరైన విజువల్స్ ఎఫెక్ట్స్ చూపించలేకపోయాయి. ఎడిటింగ్ కూడా మైనస్ అనే చెప్పొచ్చు.ఒకటి రెండు బీజీఎంలు బాగున్నప్పటికీ.. పాటలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.
అనీష్ నటుడిగా, దర్శకుడిగా బెస్ట్ ఫర్ఫార్మెన్స్ చూపించాడు. స్రిక్ట్ ఫాదర్‌గా రాజీవ్ కనకల నటన బాగుంది. స్వరూపిణి కూడా సూపర్‌గా నటించింది. ఇద్దరు హీరోయిన్లు కూడా వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు.