హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా జఫర్‌గఢ్ ఖిల్లా దిగువన పాటిగడ్డపై ప్రాచీన జైన బసది అవశేషాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, వేల్పుగొండ వాసి సముద్రాల రాజు గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన కీలక ఆధారాలు ఈ అన్వేషణతో బయటపడ్డాయని భావిస్తున్నారు. రాష్ట్రకూట ప్రభువు అమోఘ వర్షుని రాజప్రతినిధి, కొలనుపాక పాలకుడు శంకర గండరస వేల్పుగొండలో కొండపై చెకించిన శాసనం ఆధారంగా ఇకడ దుర్గం నిర్మాణం, కుండం తవ్వకం, జైన బసది ఉనికి ఉన్నట్టు ఇప్పటికే గుర్తంచారు.
అయితే ఇప్పటివరకు జైన బసది ప్రత్యక్ష అవశేషాలు లభించకపోవడం గమనార్హం. సముద్రాల రాజు కొనసాగించిన అన్వేషణలో బయటపడిన శకలాల్లో భారీ ద్వారబంధం భాగాలు, పంచశాఖ శైలిలో చెకిన ద్వారశాఖలు, పూలతలు, హంసల ఆకృతులు, మణిఖచిత పట్టికలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్వారబంధం పతంగంపై లలాటబింబంగా ధ్యానాసనంలో ఉన్న మహావీరుని శిల్పం చెక్కినట్టు గుర్తించారు. ఇది జఫర్‌గఢ్‌లో విశిష్టమైన జైన బసది ఉండేదని నిర్ధారించడానికి స్పష్టమైన ఆధారమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.