స్త్రీపురుష బంధాల్లోని డొల్లతనం, విశ్వాసరాహిత్యం కథావస్తువుగా రూపొందించిన ‘గెహ్రాయాన్’ చిత్రంలో ఓ నాయికగా నటిస్తున్నది అనన్యపాండే. త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా గురించి ఆమె ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ‘కెరీర్ ఆరంభం నుంచి సంక్లిష్ట భావోద్వేగాలు కలబోసిన పాత్రలపై మక్కువ పెంచుకున్నా. నటిగా పరిణతి కనబరచాలంటే పాత్రలపరమైన సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. ఈ సినిమా మరిన్ని బలమైన మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నటించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా’ అని అనన్య పాండే చెప్పింది . ఇక ప్రేమ విషయంలో తనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయని.. పవిత్రమైన ప్రేమను అంత సులభంగా నిర్వచించలేమని పేర్కొంది. చిన్నతనం నుంచి తాను షారుఖ్‌ఖాన్ ప్రేమ కథా చిత్రాలు చూసి స్ఫూర్తిపొందానని..అందులోని ఉదాత్త, ఆదర్శ భావాలున్న కథానాయకుడు అంటే చాలా ఇష్టమని చెప్పింది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి సహచర్యం దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుందని తెలిపింది. ఆత్మవంచన లేకుండా పారదర్శకంగా సాగే బంధాలే కలకాలం నిలిచిపోతాయని అనన్యపాండే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ విజయ్ దేవరకొండ సరసన పాన్ఇండియా చిత్రం ‘లైగర్’లో కథానాయికగా నటిస్తున్నది.