సినిమా పేరు: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావురమేశ్..
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య
ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాల విజయాలతో హ్యాట్రిక్ కొట్టి స్టార్ ఎంటర్టైనర్ అనిపించుకున్నారు హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన్నుంచి చాలా విరామం తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై జనాల్లో ఆసక్తి మెండుగా ఉంది. ప్రతిష్టాత్మక సితార సంస్థ నిర్మించిన చిత్రం కావడం వల్ల సినిమాపై జనాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ‘అనగనగా ఒక రాజు’ అందరి అంచనాలనూ అందుకున్నాడా? సంక్రాంతికి హిట్టు కొట్టాడా? నవీన్ తన విజయాలను కొనసాగించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
అది గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామం. ఆ గ్రామంలో ఓ జమీందర్ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి ఏకైక వారసుడు రాజు(నవీన్ పొలిశెట్టి). అతని తాత దానధర్మాలు చేసి ఆస్తి అంతా తగలేశాడు. అంతా పోయినా పరువు మాత్రమే మిగిలుంది. ఆ పరువును కాపాడుకుంటూ.. తాను ఇప్పటికీ కోటీశ్వరుడ్నే అన్నట్టు ఊరి జనాలను ఏమారుస్తూ జీవనం సాగిస్తుంటాడు రాజు. అలాంటి రాజుకు ఓ పెళ్లిలో బంధువుల వల్ల అవమానం జరుగుతుంది. దాంతో కోటీశ్వరుడి ఇంటికి అల్లుడ్ని అవుతాననీ, గత వైభవాన్ని తిరిగి తెస్తాననీ, తొలి శుభలేఖ మీకే ఇస్తానని సవాలు విసిరి, కోటీశ్వరుడి అల్లుడు అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెడతాడు. అలాంటి టైమ్‌లో అతనికి పక్క ఊరి జమీందార్ ఏకైక కుమార్తె చారులత(మీనాక్షి చౌదరి) తారసడుతుంది. తన తెలివిని ఉపయోగించి చారులతను ప్రేమలో పడేస్తాడు. చారులత కూడా ఇంట్లో ఒప్పించి, రాజును వివాహం చేసుకుంటుంది. పెళ్లి అయ్యాక రాజుకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? రాజు కోటీశ్వరుడి అల్లుడు అయ్యాడా? గత వైభవాన్ని సాధించాడా? బంధువుల దగ్గర హీరోగా నిలిచాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
వినోదంతో మొదలై ఎమోషన్స్‌తో ముగిసే కథ ఇది. అయితే కొత్త కథేం కాదు. గతంలోనూ ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. పాత కథల్ని కొత్తగా తీయడమే సక్సెస్ ఫార్ములా. ఈ విషయంలో దర్శకుడు మారి కొంతమేర విజయం సాధించాడు. ఇందులో హీరోహీరోయిన్లిద్దరిదీ ఒకేలాంటి నేపథ్యం. ఒకేలాంటిసమస్య. ఇద్దరూ నిజాన్ని దాచి జానాన్ని ఏమారుస్తూ బతుకుతుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకర్నొకరు ఏమార్చుకుంటారు. అదే ఈ కథలో కొత్త పాయింట్. ప్రథమార్థమంతా వినోదానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు మారి. అక్కడక్కడ నవ్వించగలిగాడు. నవీన్ పొలిశెట్టి స్థాయి హ్యూమర్ మాత్రం ఈ సినిమాలో కనిపించదు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం తనదైన శైలిలో నవీన్ అందర్నీ నవ్వించాడు. ఆస్తులన్నీ కరిగిపోయి.. అప్పులు మిగిలినా.. సమాజానికి మాత్రం అదేం తెలీకుండా హోదాను మెయింటెన్ చేసే జమీందర్ వంశానికి చెందిన ఒక్కగానొక్క వారసుడిగా నవీన్ పోలిశెట్టి బాగా అభినయించాడు. ఇందులో కథానాయిక మీనాక్షి చౌదరి నేపథ్యం కూడా ఇంచుమించూ ఇదే. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి. వీరు కలవడం, వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో ప్రథమార్ధం వినోదాత్మకంగా ముగిసింది. ఇక ద్వితీయార్ధమంతా సమస్యల నుంచి బయటపడేందుకు హీరో ఊరి ప్రెసిడెంట్‌గా ఎన్నికల్లో నిలబడటం, ఊరి కష్టాలను తెలుసుకొని, వారి సమస్యలు తీర్చడం ఇలా వేరే కోణంలో సాగింది.
నటీనటులు
నవీన్ పొలిశెట్టి ఎప్పటిలాగే తనదైన చురుకుతనంతో అలరించాడు. జమీందార్ వారసుడైన రాజు పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. చక్కని వినోదాన్ని కూడా పంచాడు. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా నటించాడు. ఇప్పటివరకూ యాక్షన్ జానర్లో నటించని నవీన్.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌తో కూడా ఆకట్టుకున్నాడు. ఇక మీనాక్షి చౌదరి చాలా అందంగా ఉంది. చక్కగా నటించింది. కథను మలుపుతిప్పే పాత్రను రావురమేశ్ పోషించాడు. ఎప్పటిలాగే తనదైన శైలితో ఆకట్టుకున్నాడు మిగతా పాత్రధారులంతా పరిధిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా
కథ, కథనాల విషయంలో దర్శకుడు మారి కాస్త జాగ్రత్త తీసుకుంటే బావుండేది. కొన్ని సీన్స్ మాత్రం బావున్నాయి అనిపిస్తుంది. సంగీతం బావుంది. ముఖ్యంగా ‘భీమవరం బాలమా..’ పాట యూత్‌ని నచ్చుతుంది. కెమెరా వర్క్ కూడా పర్లేదు. ఇక ఎడిటర్‌కి చాలా పనుందనిపించింది. నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వారి ప్రతి పైసా తెరపై కనిపించింది. మొత్తంగా సాంకేతికంగా సినిమా పర్లేదనిపించింది.
మొత్తంగా కామెడీ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చొచ్చు.
బలాలు
నవీన్ పొలిశెట్టి నటన, మీనాక్షి చౌదరి అందం, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్
బలహీనతలు
కథ, కథనం, సెకండాఫ్
రేటింగ్ : 2.75/5