బీజింగ్: చైనాలో ఇప్పుడో కొత్త యాప్ పెను సంచలనం సృష్టిస్తున్నది. ఆర్ యూ డెడ్ అనే యాప్(Are You Dead App) ఇప్పుడు చైనాలో తెగ వైరల్ అవుతున్నది. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీంతో ఆ యాప్‌ను సృష్టించిన కంపెనీ ఇప్పుడు దాని కోసం సబ్స్క్రిప్షన్ ఫీజును కూడా ప్రవేశపెట్టింది. చైనీస్ భాషలో సిలిమి అని ఆ యాప్‌ను పిలుస్తున్నారు. దీన్ని ఆర్ యూ డెడ్ అని ఇంగ్లీష్ భాషలో అంటున్నారు. అయితే ఒంటరిగా ఉండే వ్యక్తుల కోసం ఆ యాప్‌ను రూపొందించారు. ఒంటరిగా ఉండే విద్యార్థులైనా లేక ఆఫీసుల్లో పనిచేసే ఒంటరి వ్యక్తులైనా లేక ఒంటరి జీవితాన్ని ఇష్టపడేవారిని టార్గెట్ చేస్తూ ఈ యాప్‌ను తయారు చేశారు.
ఆ యాప్ ద్వారా ఓ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకోవాలి. వరుసగా రెండు రోజులు యూజర్ ఆ యాప్‌ను చెక్ చేయకుంటే అది ఆటోమెటిక్‌గా నోటిఫికేషన్లు పంపుతుంది. చైనాలో ఒంటరిగా జీవిస్తున్న వారి సంఖ్య సుమారు 20 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. సోలోగా జీవించే వారి సంఖ్య వార్షికంగా 30 శాతం పెరిగిపోతున్నట్లు అంచనాలు ఉన్నాయి. చైనా డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒంటరి వ్యక్తుల కోసం ఆ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. డెముమూ పేరుతో ఆ యాప్‌ను రిలీజ్ చేస్తున్నారు. యాపిల్ పెయిడ్ యాప్ చార్ట్‌లో దీన్ని డెముమూ అని పిలుస్తున్నారు.
ఆర్ యూ డెడ్ యాప్ కాన్సెప్ట్ చాలా సింపుల్‌గా ఉంది. రెండు రోజులకు ఒకసారి చెకిన్ కావాలి. ఓ పెద్ద బటన్‌ను ప్రెస్ చేస్తే, బ్రతికి ఉన్నట్లు ఆ యాప్ గుర్తిస్తుంది. ఒకవేళ అలా చేయకుంటే, అప్పుడు ఎమర్జెన్సీ నెంబర్‌కు కాంటాక్ట్ అవుతుంది. మీరు సమస్యల్లో ఉన్న విషయాన్ని ఆ నెంబర్‌కు సమాచారాన్ని అందిస్తుంది. వాస్తవానికి గత ఏడాది మేలో ఈ యాప్‌ను లాంచ్ చేశారు. కానీ గత కొన్ని వారాల నుంచి ఆ యాప్‌కు క్రేజ్ పెరిగింది. చైనీస్ పట్టణాల్లో ఒంటరిగా జీవిస్తున్న వారు ఎక్కువగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే దేశంలోనే అత్యధిక సంఖ్యలో డౌన్లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్‌గా ఇది నిలిచింది.