తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ముచ్చటగా మూడవ బడ్జెట్’ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకొంటున్నది. గత రెండు బడ్జెట్ల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న
బీసీ సమాజం ఈసారైనా తమకు మెరుగైన కేటాయింపులు జరుగుతాయేమో అని ఆశించింది. కానీ, ఈసారి కూడా బడ్జెట్ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో
బీసీలకు నిరాశనే మిగిల్చింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56% అని తన బడ్జెట్ ప్రసంగంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రస్తావించారు.
కానీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం కనీస కేటాయింపులు జరుపకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్లో బీసీలకు రూ.9,200 కోట్లు (3.15%) మాత్రమే కేటాయించగా, రెం డో బడ్జెట్లో రూ.11,405 కోట్లు (3.73%) మాత్రమే విదిల్చింది. ఇక ఈ సారి 2026-27 బడ్జెట్లో రూ.12,500 కోట్లు (3.85%) మాత్రమే బీసీ వర్గాల కోసం కేటాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఎంత
చులకనగా చూస్తున్నదో బడ్జెట్లను బట్టి అర్థమవుతున్నది. రాష్ట్ర జనాభాలో 56% ఉన్న వెనుకబడిన తరగతులకు కేవలం 3.85% కేటాయింపులు చేసి సర్కార్ అవమానించింది. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇది సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందని భట్టివిక్రమార్క అన్నారు, కానీ, 3% మించని నిధులతో 56% ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయో, ఇది ఏ విధంగా సామాజిక, ఆర్థిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందో ప్రభుత్వమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడి, సంక్షేమంలో సమన్వయ లోపంతో ప్రజల జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అధికారమే పరమావధిగా భారీ హామీలిచ్చి, అమలు చేయలేక ఆ పార్టీ నేతలు అసమర్థతను చాటుకుంటున్నారు. ‘ఆర్థిక వ్యవస్థ బాగా లేదు అప్పు పుడుత లేదు’ అని చేతులెత్తేయడం ఎలా ఉందంటే ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా ఉన్నది. ఆరు గ్యారెంటీలతో పాటు, కామారెడ్డి డిక్లరేషన్ హామీలతో కాంగ్రెస్ మభ్యపెట్టడం వల్లే ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది.
బీసీలకు 42% రిజర్వేషన్ల వాగ్దానంతో కాంగ్రెస్ ఆశపెట్టింది. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధతతోపాటుగా ఏటా రూ.20,000 కోట్లతో ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన మూడు బడ్జెట్లలో కలిపి బీసీలకు రూ.60,000 కోట్లు అందాలి. కానీ, కేటాయింపులు మాత్రం రూ.33,116 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. ఇవి కూడా కేటాయింపుల లెక్కలే, ఖర్చు చేసినవి కాదు. గత రెండు బడ్జెట్లలో కేటాయించిన వాటిలో ఖర్చు చేసింది కేవలం రూ.5,500 కోట్లు మాత్రమే. అంటే కేవలం 24.2 శాతం. ఇది బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.
ర్యాంకులు, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా, బీసీ బిడ్డలకు కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాస్థాయుల్లో సాంకేతిక, ఇంజినీరింగ్, వైద్య విద్య సహా అన్ని కోర్సులకు ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తుందని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతున్నా, సరైన బడ్జెట్ కేటాయింపులు ఉండటం లేదు. ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో రీయింబర్స్‌మెంట్‌పై అటు ఇటుగా రూ.35,000 వరకు మాత్రమే సీలింగ్ పెట్టడంతో మిగతా భారం విద్యార్థుల కుటుంబాలపై పడుతున్నది. ఒకవైపు ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇస్తూ, అందుకు తగిన రీయింబర్స్మెంట్ మాత్రం ఇవ్వకపోవడంతో పేద బీసీ బిడ్డలు విద్యకు దూరం అవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థలు మూసివేసి రోడ్డెక్కాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కనీసం ఈ బడ్జెట్లో అయినా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తగిన నిధులు కేటాయిస్తారని బీసీ బిడ్డలు ఎదురుచూశారు. కానీ గత బడ్జెట్ లాగానే కేవలం రూ.1,290 కోట్లు కేటాయించారు. ఇది గత బకాయిలకే సరిపోదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల విద్యావిప్లవం మొదలైంది. కేసీఆర్ పాలనలో నాణ్యమైన విద్యకు, పౌష్టికాహారానికి గురుకులాలు కేంద్ర బిందువుగా నిలిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 19గా ఉన్న బీసీ గురుకులాల సంఖ్యను కేసీఆర్ ప్రభుత్వం 294కు పెంచింది. బీసీల కోసం నవోదయ స్థాయిలో మండలానికొక బీసీ గురుకులం, జిల్లాకొక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించింది. ఈ లెక్కన ఇంకో 320 కొత్త గురుకులాలు ఏర్పాటు చేయాలి. కానీ, ఈ ప్రభుత్వం ఒక్క కొత్త గురుకుల విద్యాసంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. ఉన్న గురుకులాలను అధ్వానంగా మార్చింది.
ఇటీవల చాలా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఇది ప్రభుత్వ పని తీరుకు నిదర్శనం. అంతేకాకుండా గురుకుల డిగ్రీ కాలేజీలను మూసివేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా
కమిషన్ నివేదికలో సిఫారసు చేసింది. ప్రభుత్వ ఆలోచనలను కమిషన్ నివేదికలో పొందుపర్చినట్టుగా అర్థమతున్నది.
ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లో కేటాయింపులు చేసి, చేతులు దులుపుకొంటున్నది. మూడు బడ్జెట్లలో ఒక్క పైసా కూడా విదల్చలేదు. గత ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్ల పంపిణీ, నేతన్నలకు 50% రాయితీలు, ముదిరాజ్‌లకు చేప పిల్లలు, వాహనాల పంపిణీ, గౌడన్నలకు నీరా పాలసీ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఆయా కులాల్లోని కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడింది. కానీ, ఈ ప్రభుత్వం రెండున్నరేండ్లలో బీసీల జీవితాలను మార్చే ఒక్క నూతన పథకాన్ని కూడా ప్రారంభించకపోగా, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కనీసం నిధులు కేటాయించలేదు. రజక, మంగళి తదితర వర్గాలు, అత్యంత వెనుకబడిన కులాలు (ఎంబీసీ)లకు దోబీఘాట్ల నిర్మాణం, పనిముట్లు, ఉచితంగా షాపుల ఏర్పాటు వంటి హామీలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని కుల వృత్తుల వారికి పెన్షన్ అర్హత వయసును 50 ఏండ్లుగగా నిర్ణయిస్తామన్న హామీని కూడా కాంగ్రెస్ అటకెక్కించింది.
తమది బీసీల పక్షపాత ప్రభుత్వం అంటూ లేని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వరుసగా మూడు బడ్జెట్లలో అరకొర కేటాయింపులు చేసి, తడిగుడ్డతో బీసీల గొంతు కోసింది. బీసీల అభివృద్ధి, సంక్షేమం పట్ల తనది సవతి తల్లి ప్రేమేనని 2026-27 బడ్జెట్‌తో మరోసారి నిరూపించుకున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను పక్కనబెడుతూ, ఒక్క నూతన పథకాన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించలేదు. ఇప్పటికే మూడు వార్షిక బడ్జెట్లు పూర్తయ్యాయి. తాజాగా బడుగులను ముప్పుతిప్పలు పెట్టేలా కక్షపూరితంగా బీసీలకు 3.85% శాతం నిధులు కేటాయించింది. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల పట్ల అమానవీయమైన వైఖరి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని వెనుకబడిన తరగతుల ప్రజలు గుర్తించాలి. బీసీలు తమ న్యాయమైన వాటా కోసం ఉద్యమించడం అవసరం మాత్రమే కాదు, అనివార్యం. నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్‌ను ఇంకా ఉపేక్షిస్తే బీసీల ఉనికి, అస్తిత్వం, మనుగడకే ప్రమాదం.
(వ్యాసకర్త: కాకతీయ విశ్వవిద్యాలయంపూర్వ ఉపకులపతి)
తమది బీసీల పక్షపాత ప్రభుత్వం అంటూ లేని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వరుసగా మూడు బడ్జెట్లలో
అరకొర కేటాయింపులు చేసి, తడిగుడ్డతో బీసీల గొంతు కోసింది. బీసీల అభివృద్ధి, సంక్షేమం పట్ల తనది సవతి తల్లి ప్రేమే
అని 2026-27 బడ్జెట్‌తో మరోసారి నిరూపించుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిన పథకాలను
పక్కనబెడుతూ, ఒక్క నూతన పథకాన్ని కూడా ఇప్పటివరకు ప్రారంభించలేకపోయింది.