తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపడుతూ ‘స్టోరీస్ ఆఫ్ తెలంగాణ’ డాక్యుమెంటరీని రూపొందించారు సినిమాటోగ్రాఫర్ డి. సమీర్ కుమార్. సుప్రియ యార్లగడ్డ నిర్మాణ బాధ్యతలు వహించారు. పేర్ని నృత్య రూపకర్త డాక్టర్ నటరాజ రామకృష్ణ శత జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని అమల, ప్రముఖ నృత్యకారులు కళాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ..‘తెలంగాణ సంప్రదాయం, సంస్కృతీ గొప్పదనం నేటితరానికి తెలిసేలా ఈ డాక్యుమెంటరీ రూపొందించడం అభినందనీయం. దీన్ని మా సుప్రియ నిర్మించడం సంతోషంగా ఉంది. క్రమశిక్షణ, అంతరశక్తికి నృత్యం ఒక వేదిక లాంటిది. డ్యాన్స్ మన శక్తిని వెలికితీస్తుంది’ అన్నారు.