ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 19: ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి (ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెం ట్) ప్రాజెక్టును శనివారం ప్రారంభించారు. ఓయూ కెమిస్ట్రీ ఫౌండేషన్ (ఓయూసీఎఫ్) ఆధ్వర్యంలో ఓయూలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి హా జరై మాట్లాడారు. విభాగంలోని రెండు ల్యాబ్‌ల అభివృద్ధికి గతంలో విరాళం ఇచ్చానని, మరో ల్యాబ్ కు, ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత ఎంఎస్ఎన్ రెడ్డి విరా ళం ఇచ్చారని చెప్పారు. విభాగం అభివృద్ధికి మరో రూ.కోటి విరాళం ప్రకటించారు.
అమెరికాలోని యా క్సెంట్ ఫార్మాస్యూటికల్స్ అధినేత డాక్టర్ సుధాకర్ విడియాల లక్ష డాలర్లు (సుమారు రూ.75 లక్షలు), మరో పూర్వ విద్యార్థి భాస్కర్‌రావు లక్ష డాలర్లు, ఎంఎస్ఎన్ రెడ్డి మరో రూ.76 లక్షలు, ప్రవాస భారతీయులు కృష్ణం రాజు, ఉష 50 వేల డాలర్లు (సుమారు రూ.37 లక్షలు), ప్రమోద్, అనురాధ 25 వేల డాలర్లు (సుమారు 19 లక్షలు) అందజేయనున్నట్టు ప్రకటించా రు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓయూసీఎఫ్ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి భాస్కర్‌రెడ్డి, మాజీ వీసీ ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ, తెలంగాణ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్‌గుప్తా, కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.