‘ట్రైలర్ చూస్తుంటే ప్రేమికుల రోజున రావాల్సిన సినిమా సంక్రాంతికే విడుదలవుతున్న అనుభూతి కలుగుతున్నది. డేట్‌నైట్ పాటలో ఆశిష్ డ్యాన్సులు బాగున్నాయి’ అని అన్నారు అల్లు అర్జున్. ‘రౌడీ బాయ్స్’ సినిమాలోని ‘డేట్‌నైట్’ పాటను సోమవారం హైదరాబాద్‌లో ఆయన విడుదలచేశారు. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదలకానుంది.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ వేడుక నాకు ఎంతో ప్రత్యేకమైనది. నటుడిగా నా ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. దిల్‌రాజు లేకపోతే ఆ సినిమా లేదు. ‘ఆర్య’ సినిమా టైమ్‌లో ఆశిష్, అన్షు, హర్షిత్ చిన్న పిల్లలు. ఇప్పుడు వారిలో ఒకరు హీరో, మరొకరు నిర్మాతగా ఎదగడం ఆనందంగా ఉంది. నా సొంత కుటుంబ సభ్యులు ఉన్నత స్థానానికి చేరుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆశిష్‌ను ప్రోత్సహించాలనే బాధ్యతతో నా సొంత వేడుకగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చాను. డిసెంబర్లో విడుదలైన నా సినిమా పుష్పతో పాటు అఖండ, శ్యామ్‌సింగరాయ్ చక్కటి విజయాల్ని సాధించాయి.
సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు ఆ విజయాల్ని కొనసాగించాలి. తెలుగు సినిమా గెలవాల్సిన సమయమిది’ అని పేర్కొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘2004లో ‘ఆర్య’లోని ‘థకదిమితుమ్’ పాటను వైజాగ్‌లో అల్లు అర్జున్‌పై తెరకెక్కిస్తున్న సమయంలో ఆశిష్ అక్కడే ఉన్నాడు. అప్పుడు అతడి వయసు ఏడేళ్లు. ఇన్నేళ్ల తర్వాత ఆశిష్ నటించిన సినిమా పాటను బన్నీ విడుదలచేయడం ఆనందంగా ఉంది. ఆశిష్ జీవితంలో ఎప్పటికీ ఈ రోజు గుర్తుండిపోతుంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. పదిహేనేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ల మధ్యనున్న యువతీయువకులను ఈ సినిమా మెప్పిస్తుంది.
ప్రేమదేశం, తొలిప్రేమ, ఆర్య, హ్యాపీడేస్ తరహాలో ఆహ్లాదభరితంగా సాగుతుంది. థియేటర్స్‌లో ప్రతి ఒక్కరికి నవ్వులను పంచుతుంది. ఆ గ్యారెంటీని మేము ఇస్తున్నాం. మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ కుటుంబ విలువలతో సాగుతాయి. ఈ సినిమా కోసం కొన్ని హద్దులను దాటాం. కథానాయకుడిగా ఆశిష్‌కు చక్కటి శుభారంభాన్ని అందిస్తుంది. సంక్రాంతి సమయంలో మా సంస్థ ద్వారా ఇప్పటివరకు విడుదలైన ఐదు సినిమాలు పెద్ద విజయాల్ని సాధించాయి. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్‌ను అందుకుంటామనే నమ్మకముంది’ అని తెలిపారు. ఆశిష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా ఫస్ట్‌లుక్‌ను దర్శకులు సుకుమార్, వినాయక్, ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదలచేయడం సంతోషాన్నిచ్చింది.
నా అభిమాన నటుడు బన్నీ ‘డేట్‌నైట్’ పాటను విడుదలచేయడం మర్చిపోలేను. అల్లు అర్జున్‌లోని అంకితభావం, క్రమశిక్షణ నన్ను ఆకట్టుకుంటాయి. కష్టపడితేనే సినిమాల్లో రాణించగలమని ఆయన నుంచే తెలుసుకున్నా. ఇండస్ట్రీలోని బెస్ట్ డ్యాన్సర్స్‌లో బన్నీ ఒకరు. ఆయన నా సినిమాలోని పాటను విడుదలచేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘నా తొలి చిత్రం ‘హుషారు’ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి అల్లు అర్జున్ చక్కటి ప్రోత్సాహాన్ని అందించారు. ఆయనకు నేను వీరాభిమానిని. ఫ్రెషర్స్ పార్టీ నేపథ్యంలో ‘డేట్‌నైట్’ పాట సాగుతుంది. రొటీన్‌కు భిన్నంగా ఈ పాటను చిత్రీకరించాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో శిరీష్, హర్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.