అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికై యాభైశాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఈ ఏడాది దసరా బరిలో ఈ చిత్రాన్ని నిలిపేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్-లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ దాదాపుగా ఖరారైందని తెలుస్తున్నది.
సంక్రాంతి తర్వాత లోకేష్ కనకరాజ్ లొకేషన్ రెక్కీ నిర్వహించనున్నారని, అనంతరం హైదరాబాద్‌లో సినిమా కోసం పూర్తిస్థాయి ఆఫీసును ప్రారంభిస్తారని అంటున్నారు. అల్లు అర్జున్-అట్లీ మూవీ ఆగస్ట్ కల్లా చిత్రీకరణ పూర్తిచేసుకుంటుందని సమాచారం. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా సెట్స్‌లో బన్నీ జాయిన్ అవుతారని అంటున్నారు. గ్యాంగ్‌స్టర్, మాఫియా నేపథ్య డ్రామాలను తెరకెక్కించడంలో లోకేష్ కనకరాజ్ సిద్ధహస్తుడు. మరి బన్నీ సినిమా కోసం ఆయన ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనుందని సమాచారం.