కామెడీ జోనర్‌ను పక్కన అల్లరి నరేశ్ ఇప్పుడు విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నాడు. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో నరేశ్ నటించిన 12A రైల్వే కాలనీ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా, సాయికుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం..
కథ విషయానికొస్తే.. కార్తీక్ (అల్లరి నరేశ్) ఓ రాజకీయ నాయకుడి దగ్గర పనిచేస్తుంటాడు. తన పక్కింట్లో ఉండే ఆరాధన ( కామాక్షి భాస్కర్ల)ను ప్రేమిస్తుంటాడు. ఈ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కార్తీక్ జీవితం ఇలా సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా ఆరాధనను, వాళ్ల అమ్మను ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఈ కేసులో కార్తీక్‌నే పోలీసులు పట్టుకుంటారు. మరి ఆరాధనను ఎవరు హత్య చేశారు? ఈ కేసు నుంచి కార్తీక్ ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతనికి తెలిసిన నిజాలేంటనేవి మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే.. పొలిమేర, పొలిమేర 2 మేకర్స్ నుంచి వచ్చిన సినిమా, అల్లరి నరేశ్ ఉండటంతో ఈ సినిమాపైమంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో మేకర్స్ విజయం సాధించారు. ఫస్టాఫ్‌లో హీరో, అతని గ్యాంగ్ ఓ పొలిటికల్ లీడర్ కోసం చేసే పనులు, హీరోయిన్‌తో ప్రేమలో పడటం వాటి చుట్టే తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్లో హీరోయిన్ మర్డర్‌కు గురవ్వడంతో అసలు సినిమా మొదలవుతుంది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తిని క్రియేట్ చేశాడు. కానీ క్లైమాక్స్ వరకు ఆ థ్రిల్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ కథలో థ్రిల్ పంచే అంశాలు చాలానే ఉన్నప్పటికీ.. వాటిని ఒక్కొక్కటిగా విప్పడంలో డైరెక్టర్ చాలా కాలయాపనచేశాడు. అది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. క్లైమాక్స్ కోసమే సినిమాను తీసినట్లు అనిపిస్తుంది.
సెకండాఫ్‌లో కథ అంతా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది.. సినిమాకు తాంత్రిక పూజల కాన్సెప్ట్‌ను కూడా జోడించడం కొంత బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్లుగా భయపెట్టే సీన్లు అంతగా ఏమీ లేవు. క్లైమాక్స్ మాత్రం ఊహించలేనట్లుగా ఉంటుంది..
నటీనటుల విషయానికొస్తే.. అల్లరి నరేశ్ సినిమా మొత్తం సీరియస్ టోన్‌లో కనిపిస్తాడు. తన పరిధిలో బాగానే నటించాడు. కథలో కామాక్షి భాస్కర్లది కీలక పాత్ర. సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. సాయికుమార్ కూడా తన పరిధి మేరకు నటించాడు.
రేటింగ్ 2.75/5