సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే సమయంలో అన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాలని, తమ వద్దకు వచ్చే కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ చేసిన పనికి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు మెయింటెన్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ సీసీఎస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బ్లాక్‌ఫిల్మ్‌లు, సైరన్లు, మ్యూజికల్ అండ్ మల్టీటోన్ హారన్లు, మోడిఫైడ్ సైలెన్సర్లు, నంబర్ప్లేట్లు, వాహనాల మార్పులకు సంబంధించి సంబంధిత కార్ డెకార్స్, మెకానిక్స్, రేడియం డిజైనర్స్ తదితర వ్యాపారులతో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వప్రసాద్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌కు అనుగుణంగా మోటార్ వెహికల్ చట్టం ప్రకారం వ్యాపారులు ట్రాఫిక్ విభాగానికి సహకరించాలని చెప్పారు. బ్లాక్ ఫిల్మ్‌లను నిషేధించారని, వాహన తయారీదారులు బ్లాక్ ఫిల్మ్‌లు వేసే క్రమంలో కచ్ఛితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. మల్టీ టోన్ హారన్లను ఇన్స్టాల్ చేయకూడదని, నంబర్ప్లేట్లను కూడా వాహన చట్టం ప్రకారమే ఆంగ్ల అక్షరాలు, అరబిక్ అంకెలను ప్రదర్శించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని, వాహనదారుల భద్రత తమ లక్ష్యమని, ఇందుకు అందరూ సహకరించాలని విశ్వప్రసాద్ తెలిపారు. సమావేశంలో భాగంగా వ్యాపారులు, మెకానిక్‌లకు మోటార్ వాహనచట్టం ఇతర అంశాలకు సంబంధించిన నిబంధనలపై ప్రశ్నోత్తరాల సెషన్‌ను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీలు రాహుల్‌హెగ్డే, అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, కార్ డెకార్స్, ఆటోమొబైల్ షాపులు, ఆటోమొబైల్ వర్క్‌షాపులు, రిజిస్టేష్రన్ నంబర్ప్లేట్ల తయారీదారులు పాల్గొన్నారు.