Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.మొదటగా ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్‌ను వాయిదా వేసి ఏప్రిల్ 17కు మార్చారు. అయినప్పటికీ సినిమాపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ప్రత్యేక సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఏప్రిల్ 16 రాత్రి 9 గంటల నుంచే స్పెషల్ షోలను ప్రదర్శించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ‘భూత్ బంగ్లా’ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ బోర్డు నుంచి క్లియర్ అయిన ఈ సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలుగా ఉంది. సాధారణంగా హారర్ సినిమాలకు ఈ స్థాయి నిడివి ఎక్కువగా అనిపించినా, ఇందులో కామెడీ అంశాలు బలంగా ఉండటంతో ప్రేక్షకులకు బోర్ అనిపించదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హారర్, కామెడీ మిశ్రమంతో రూపొందిన ఈ చిత్రం ప్రియదర్శన్ స్టైల్లో వినోదాన్ని పంచేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్, భయానక సన్నివేశాలు కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి.
‘భూత్ బంగ్లా’ విడుదల వాయిదా పడినప్పటికీ, స్పెషల్ షోలతో ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావడం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. రిలీజ్ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా, కొన్నాళ్లుగా బాలీవుడ్లో సరైన విజయాలు రాకపోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.