Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 86 ఏళ్ల వయసులో సోమవారం ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. అదే రోజు సాయంత్రం బెంగళూరు లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఆమెకు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న ప్రకాష్ రాజ్ ఇలా మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడంపై కొందరు నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ గతంలో “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వీడియో క్లిప్‌ను, తల్లి అంత్యక్రియల సమయంలో చర్చిలో ఉన్న ఆయన దృశ్యాలతో కలిపి పోస్ట్ చేశాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “అవును… నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ మా అమ్మ తన దేవుడిని నమ్మేది. ఆమె నమ్మకాల ప్రకారం అంత్యక్రియలు జరిపించుకునే హక్కును నేను ఎలా కాదనగలను? ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించడం కనీస మానవత్వం. ద్వేషాన్ని రెచ్చగొట్టే వారికి ఇది ఎలా అర్థమవుతుంది?” అంటూ ఘాటుగా స్పందించారు. ప్రకాశ్ రాజ్ నాస్తికుడని విషయం ఆయన గతంలో పలుమార్లు స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ, తన తల్లి విశ్వసించిన మత సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమెకు క్రైస్తవ పద్ధతిలో అంతిమ వీడ్కోలు పలికారు.
ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక కొడుకుగా తల్లి నమ్మకాలను గౌరవించడం తప్పుకాదని, వ్యక్తిగత విశ్వాసాలు వేరైనా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం ప్రశంసనీయం అని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన వ్యక్తిగత నమ్మకాలు, కుటుంబ విలువలు, పరస్పర గౌరవం మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని మరోసారి చర్చకు తెచ్చింది.
Prakash Raj Calls himself an atheist & says he doesn’t believe in God
Yet performs his mother’s last rites following Christian traditions
— The Jaipur Dialogues (@JaipurDialogues) April 1, 2026