రేడియోలో సినిమా పాటలు వినడం పరిపాటి. కానీ, సినిమాల్లో రేడియో (Radio)పాటల సన్నివేశాలంటే మాత్రం కొంచెం ఆలోచన.. మరి కొంచెం ఆసక్తి కలుగుతుంది. సోషల్ మీడియా ప్రభంజనంలో, ‘పాడ్‌కాస్టింగ్’ కల్చర్‌లో పడిపోయిన ఈ తరం వారికి బ్రాడ్‌కాస్టింగ్ గురించి అవగాహన లేదు. కానీ, ఒక అరవై సంవత్సరాల వెనక్కి వెళ్లి చూస్తే నాటి సమాజంలో రేడియోకు ఉన్న ప్రాముఖ్యం, గౌరవం తెలుస్తుంది. అలనాటి సినిమాలలో కథా పరంగా రేడియోలో పాటలు పాడే సన్నివేశాలను చేర్చేవారు. రేడియో నేటి తరానికి పరిచయం లేని వస్తువేమో! నిన్నటి తరానికి ఓ నేస్తం. మొన్నటి తరానికి ఓ మార్గదర్శి. వెండితెర పాటల్ని శ్రోతల చెంతకు చేర్చే సాధనం అప్పట్లో రేడియో మాత్రమే! రేడియో ప్రసారాలు వినేందుకు ఊరంతా ఒక్క గూటికి చేరుకునేవారు కూడా! అంత ఆదరణ ఉండబట్టే.. వెండితెరపై ఆకాశవాణికి (Akashvani) అందలం దక్కింది. లెక్కకు మిక్కిలి చిత్రాల్లో రేడియో చుట్టూ పాటలు, సన్నివేశాలు అల్లుకునేవాళ్లు సినీ దర్శకులు. ఆ సీన్లు ప్రేక్షకులు కన్నార్పకుండా చూసేవారు. ఆ పాటల గురించి కథలుగా చెప్పుకొనేవాళ్లు. ఆ ముచ్చట్లే ఇవి.. వెండితెరపై మెరిసిన ఆకాశవాణి వెలుగు రేఖల్ని గుర్తుచేసుకోవడం అంటే.. కాలయంత్రంలో ఒకసారి వెనక్కి వెళ్లి రావడమే! ఎందుకు ఆలస్యం.. ‘యే ఆకాశవాణి హై.. అబ్ సునియే.. ఔర్ పడియే’…
భారతీయ చలనచిత్రాలు, ప్రత్యేకించి టాకీ సినిమాల ఆరంభం నుంచే వెండితెరకు, రేడియోకు అవినాభావన సంబంధం ఉందని పరిశీలనలో తెలుస్తుంది. దేశంలో టాకీలకు ముందే రేడియో ప్రసారాలు 1927లో మొదలైనప్పటికీ.. ఆలిండియా రేడియో పేరుతో అధికారికంగా శ్రోతలకు చేరింది 1936 జూన్ 8వ తేదీన. 1956లో ఆకాశవాణి పేరును స్వీకరించింది. సరే ఇదంతా మన దేశంలోని రేడియో గురించే. తొలి టాకీ అర్దెషీర్ ఇరానీ నిర్మించిన ‘ఆలం ఆర’ (1931) చిత్రంలో రేడియో ప్రస్తావన ఉన్నట్లు ఆ సినిమా చూసిన ఆనాటి తరం చెబుతుంటారు. దురదృష్టవశాత్తు తొలి టాకీ యుగంలో విడుదలైన చిత్రాల తాలూకు వీడియోలు లభించడం లేదు. ఆ రోజుల్లో రేడియో కళాకారులకు చాలా విలువ ఉండేది. ఒక విధంగా ఆకాశవాణి ఆడిషన్స్‌లో నెగ్గినవారికే సినిమాల్లో అవకాశాలు లభించేవన్నది చారిత్రక సత్యం. సినిమాల్లో కూడా కథలో భాగంగా రేడియో సన్నివేశాలు అనివార్యంగా ఉండేవి. ఎన్నెన్నో సినిమాల్లో రేడియో కీలకంగా కనిపిస్తూ ఉండేది.

హిందీ సినిమాలకు సంబంధించి చూస్తే… ఎన్నో ఆపాత మధురాలతో కూడిన అద్భుత సన్నివేశాలు ఆకాశవాణితో పెనవేసుకొని కనిపిస్తాయి. 1960లో హృషికేశ్ ముఖర్జీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనురాధ(1960) చిత్రం ప్రారంభంలోనే ఒక రేడియో సెట్టును చూపిస్తారు. వెంటనే ఒక అనౌన్స్మెంట్ వినబడుతుందిలా ‘యే ఆల్ ఇండియా రేడియో బాంబే హై. అబ్ హమ్ ఆప్కో కుచ్ పురానే గానోఁకే రికార్డ్ సునాయేంగే. పెహ్లే సునియే సావరే, సావరే.. గాయిక అనురాధ రాయ్’.. తదుపరి టైటిల్స్ తెరపై వస్తుంటే నేపథ్యంలో రేడియో పాట వినబడుతుంది. ఈ కథ ఒక ప్రసిద్ధ గాయని అయిన అనురాధ (లీలా నాయుడు) అనే అమ్మాయి గురించి. ఆమె తన డాక్టర్ భర్త (బలరాజ్ సహాని)తో ఉండటానికి కెరీర్‌ను త్యాగం చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం పండిట్ రవిశంకర్ అందించగా, శైలేంద్ర పాటలు రాశారు. మిస్ ఇండియా లీలా నాయుడు తొలి సినిమా ఇది.

ప్రముఖ నటుడు, చంద్రశేఖర్ వైద్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రొమాంటిక్ చిత్రం ‘చా చా చా’ (1964). ఇందులో కథానాయకుడు చంద్రశేఖర్ వైద్య పాడిన ‘వో హమ్ న థే.. వో తుమ్ న థే’ పాటను హెలెన్ రేడియోలో వింటూ ఉంటుంది. ఈ పాటకు గాత్రదానం చేసింది మహమ్మద్ రఫి. ఈ పాట ‘అభీ ఆప్ ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కే కలాకార్ సే…..’ అనే ప్రకటనతో ప్రారంభమవుతుంది. హెలెన్ తన ప్రేమికుడు రేడియోలో పాడే పాటను భారమైన హృదయంతో వింటూ బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది. ఈ పాటను నీరజ్ రాశారు. ఇక్బాల్ ఖురేషి స్వరపరచారు.
ఊంచె లాగ్ (1965) చిత్రంలో రాజ్‌కుమార్ చిన్ననాటి మిత్రుడు ఫిరోజ్ ఖాన్‌కు ట్రాన్సిస్టర్‌ను బహుమతిగా ఇస్తాడు. అతను బ్యాండ్ నంబర్ 1కి ట్యూన్ చేస్తున్నప్పుడు, ఫిరోజ్ రేడియోలో ‘హాయ్ రే తేరే చంచల్ నైన్వా -కుఛ్ బాత్ కరేఁ రుక్ జా యే’ అని తీయని గానం (లతా మంగేష్కర్) వినబడగానే ఎగిరి గంతేసి, పార్కుకు వెళ్లి తన మనసుకు నచ్చిన విధంగా వింటాడు. ఈ పాటను మజ్రూహ్ సుల్తాన్‌పురి రాయగా చిత్రగుప్త సంగీతం అందించారు.

‘నయీ ఉమర్ కి నయీ ఫసల్’ సినిమాలో రేడియో గాన సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఆర్.చంద్ర దర్శకత్వం వహించారు. తనూజ, రాజీవ్ నటించిన ఈ చిత్రం 1966 జనవరి 1న విడుదలైంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో ‘ఆజ్ కీ రాత్ బడి శోఖ్’ అనే పాటను తనూజ పాడుతుంటే ఆకాశవాణిలో రికార్డింగ్‌ని చూపుతుంది. ఈ గీతాన్ని నీరజ్ రాయగా రోషన్ స్వరాలు కూర్చారు. ఆశాభోస్లే ఎంతో ఆర్ద్రతతో పాడిన కరుణ రసాత్మక గీతమిది. పాట చివరలో రఫి ఆలపించిన పంక్తులు గుండెలను పిండేస్తాయి.
గుల్జార్ గీతాలు ఎంత భావ పరిమళ భరితంగా ఉంటాయో అందరికీ తెలుసు. ‘ఖామోషీ’ చిత్రం(1969) కోసం ఆయన రాసిన ‘హమ్ న దేఖీ హై ఉన్ ఆంఖో మే మెహత్ కీ ఖుష్బూ’ గీతాన్ని హేమంత్ కుమార్ సంగీత సారథ్యంలో లతాజీ పాడగా స్నేహలతపై చిత్రించారు. ఈ పాట సాగుతున్నంత సేపు రేడియో స్టూడియోలో బ్యాక్ డ్రాప్లో వాద్య బృందం, రికార్డింగ్ సిబ్బందిని చూపించడం విశేషం. మరోవైపు కారులో ప్రయాణిస్తున్న వహీదా రహమాన్ రేడియోలో పాటను వింటుంది. 1959లో వచ్చిన ‘దీప్ జ్వలే జాయే’ తెలుగులో ‘చివరకు మిగిలేది’ పేరుతో తీస్తే అదే చిత్రాన్ని మళ్లీ ‘ఖామోషీ’గా నిర్మించడం మరో విశేషం.
అభిమాన్ చిత్రం (1973) కోసం లతా మంగేష్కర్ పాడిన ‘పియా బినా’ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాట రేడియో స్టేషన్లో జయ భాదురీపై చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో మనం ఆకాశవాణి, చికాగో రేడియో లోగోలను చూడవచ్చు. మరోవైపు రేడియోలో ప్రసారం అవుతున్న ఈ గీతాన్ని అస్రాని ఇంట్లో అమితాబ్ బచ్చన్, బిందు వింటూ ఉంటారు. ‘అభిమాన్’ చిత్రం గాయనీ గాయకులైన దంపతుల కథ. వారి ప్రేమకు పాటే వారధి. పెళ్లి కూడా చేసుకుంటారు. ఆ పాట కారణంగానే జెలసీతో విడిపోతారు. తిరిగి పాటతోనే ఒక్కటవుతారు. వారి ప్రేమ, ఎడబాటు, అసూయ అన్నీ కనిపించే రంగస్థలంగా రేడియో స్టేషన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. ‘అబ్ తో హై తుమ్ సే, హర్ ఖుషీ అప్ నీ’ అనే పాటను రేడియోలో ఆలపిస్తుంటే ఆర్కెస్ట్రా, కండక్టర్, రికార్డింగ్ ఇంజినీర్లు, రేడియో స్టేషన్ వాతావరణం అన్నీ చూపించడం ఇందులో విశేషం.

1977లో శక్తి సామంత దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘అనురోధ్’ చిత్రంలో ‘ఆప్ కే అనురోధ్’ అనే పాటపై టైటిల్స్ పడతాయి. రేడియో కూడా ప్రధాన భూమిక పోషించే ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఒక ధనిక నగర బాలుడి చుట్టూ తిరుగుతుంది. అతను తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా సంగీతకారుడిగా ఉండాలని నిర్ణయించుకొని రేడియో స్టేషన్లో గాయకునిగా చేరుతాడు. ‘ఆతే జాతే ఖూబ్సూరత్ ఆవారా సడ్ఁకో పే’ అనే సూపర్ హిట్ పాటను రేడియో స్టేషన్లో హీరో రాజేష్‌ఖన్నా పాడుతున్నట్టుగా చిత్రీకరించారు. ఆకాశవాణిలో ప్రసారం అవుతున్న ఈ గీతాన్ని సింపిల్ కపాడియా తన ఇంట్లో రేడియోలో వింటూ ఉంటుంది. అలా రేడియోలో వీరిద్దరి ప్రేమకథ చిగురిస్తుంది.
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వంలో తీసిన ‘జుర్మానా’ (1979) చిత్రంలోని ‘సావన్ కే ఝూలో పఢే తుమ్ చలే ఆవో’ పాటను రేడియో స్టేషన్లో అభినేత్రి రాఖీ రికార్డింగ్‌లో పాల్గొని ఆలపించినట్టుగా చిత్రీకరించారు! ఈ రేడియో పాట సినిమాలో ఒక ముఖ్యమైన మలుపు, ఆనంద్ బక్షి రాసిన ఈ పాట ద్వారా ఆ చిత్రంలో హీరో (అమితాబ్ బచ్చన్) జీవితంలో కోల్పోయిన ప్రేమను తిరిగి పొందగలుగుతాడు. మొత్తం మీద హృషీకేశ్ ముఖర్జీ రేడియోపై గౌరవంతో కథకు అనుగుణంగా కొన్ని సీన్లు, పాటలను తన సినిమాల్లో చేర్చారు.
తెలుగు సినిమాల్లోనూ అప్పుడప్పుడూ రేడియో ముఖ్యపాత్ర పోషిస్తూ కనిపించింది. 1960-80 మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఆకాశవాణికి అగ్రతాంబూలం ఇచ్చినట్టు కనిపిస్తుంది. కథాపరంగా గాయని/గాయకుడు రేడియో స్టేషన్లో పాటలు పాడే సన్నివేశాలు ఉండేవి. రేడియో సింగర్ అంటే సినిమా గాయకులకున్నంత పాపులారిటీ, గ్లామర్ ఉండేదని ఆయా చిత్రాలు చూసినప్పుడు విదితమవుతుంది.
1938లోనే మాలపిల్ల చిత్రంలో రేడియో పాటల ప్రస్తావన కనిపిస్తుంది. కలకత్తాలో అగ్ర వర్ణానికి చెందిన హీరో (గాలి వేంకటేశ్వర రావు), దళిత అమ్మాయి (కాంచన మాల)ని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెండ్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఆమె చెల్లి (సుందరమ్మ)ను కూడా తీసుకొని వెళతాడు. అక్కడ ఉద్యోగంలో చేరిన సందర్భంలో రేడియోలోంచి, హమీర్ కల్యాణి రాగంలో వినబడే హిందుస్థానీ సంగీతాన్ని వారు కాఫీ సేవిస్తూ వింటారు.

1955లో తీసిన చరణదాసి చిత్రంలో ‘శాంతిలేదు జీవికి’ అనే పాట మాధవ పెద్ది సత్యం గాత్రంలో వినబడుతుంది. ఈ పాటను రేడియో స్టూడియోలో పాడించినప్పటికీ, పాడే గాయకుడు కనిపించడు. రేడియో సెట్టు మాత్రమే చూపించారు దర్శకుడు. ఎన్.టి.రామారావు, అక్కినేని, అంజలి, సావిత్రి రేడియోలో వచ్చే ఆ పాటను వింటుంటారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి మిత్రులతో కలిసి గుత్తా రామినీడు దర్శకత్వంలో నిర్మించిన చివరికి మిగిలేది (1960) చిత్రం (దీప్ జ్వలే జాయ్… రీమేక్)లో ‘అది నీవన్నది విన్నానోయి అది నిజమౌనని తీయని కలలో’ అనే మల్లాది రాసిన గీతాన్ని నూతన గాయని సుందన రేడియో స్టేషన్ రికార్డింగ్‌లో పాడుతుంది. బాలయ్య, కాంతారావు తదితరులు ఆ పాటను శ్రద్ధగా వింటూ కనిపిస్తారు.
వెలుగు నీడలు (1961) చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన గీతం ‘కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు!’. పెండ్యాల సంగీతంలో ఘంటసాల భావ గర్భితంగా ఆలపించగా, తెరపై అక్కినేని నాగేశ్వర రావు రేడియో స్టూడియోలో గాయకునిగా అభినయించాడు. ఈ సన్నివేశంలో పెండ్యాల సంగీత దర్శకునిగా పాల్గొని ఆర్కెస్ట్రా నిర్వహించడం విశేషం. నిరాశ నిస్పృహలతో ఉన్నవారికి బతుకు పట్ల ఆశ కలిగించే స్ఫూర్తిమంతమైన ఈ గీతాన్ని శ్రీశ్రీ రాశారు.
బి.ఎ.రంగా దర్శకత్వం వహించిన పెంపుడు కూతురు (1963) నాయిక ఉమ (దేవిక) రేడియో గాయని. ఆమె రేడియోలో ‘జీవనరాగం ఈ అనురాగం మధురానందమిదే’ అని పాడుతుంటే (నేపథ్య గానం: జానకి) హీరో హరనాథ్ రేడియోలో పాట వింటూ మైమరచిపోతుంటాడు.

ఎంతో ప్రజాదరణ పొందిన దేవులపల్లి వారి గీతం ‘ఇది మల్లెల వేళయనీ..’ పాట సుఖదుఃఖాలు చిత్రం కోసం ఎస్పీ కోదండ పాణి స్వరపరిచారు. సుశీలమ్మ ఆపాత మధురంగా ఆలపించి గాన కోకిల అనిపించుకున్నారు. తెరపై వాణిశ్రీ రేడియోలో ఈ పాటను అభినయించగా యస్.వి.ఆర్, చంద్రమోహన్, హరనాథ్ తదితరులు రేడియో సెట్ల ముందు కూర్చొని, తదేకంగా వింటుంటారు. జీవితరంగం (1974) చిత్రంలో సాలూరి రాజేశ్వర రావు కల్యాణి రాగంలో స్వరపరచిన ‘ఈనాటి నా పాట నీకు అంకితం.. అందించారు మాకు కొత్త జీవితం’ ఎన్నదగిన పాట.. కథాపరంగా ఈ పాటను గాయని (నీరజ) రేడియో స్టేషన్లో మధురంగా పాడుతుంది. ఈ పాటను చిత్రంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులైన గుమ్మడి, సావిత్రి, తదితర కుటుంబ సభ్యులు ఆనందంగా వింటుంటారు. పాట ప్రసారం కావడానికి ముందు సినిమాలో గుమ్మడి మూడో కూతురుగా నటించిన జయసుధ రేడియోను ఆన్ చేసి, స్టేషన్‌ను ట్యూన్ చేస్తుంది. సుశీల పాడిన ఈ పాట ఆ రోజుల్లో రేడియోలో మార్మోగింది.
అల్లుడొచ్చాడు (1976 ) సినిమాలోని ‘లేత కొబ్బరి నీళ్లల్లే పూత మామిడి పిందల్లె!!’ పాటను ఆత్రేయ రాయగా టి. చలపతిరావు సంగీతంలో ఎస్పీ బాలు పాడారు. హీరో రామకృష్ణ పై చిత్రించిన పాట ఇది. ఆయన పాడుతుంటే కాలేజీ హాస్టల్లో ప్రభ, జయసుధ తదితరులు రేడియోలో వింటూ సంబరపడిపోతుంటారు. ‘చుక్కల్లో చంద్రుడు’ (1980) చిత్రంలో నటి జయ గాయకురాలి పాత్ర పోషించింది. పరిస్థితుల ప్రభావం వల్ల బిడ్డను కోల్పోయి, గుడి ముంగిట పాటలు పాడుతూ బిచ్చమెత్తుకొనె పరిస్థితిలో ఉంటుంది. ఆమె గానాన్ని విన్న ఒక పెద్దమనిషి కూతురిగా చేరదీసి రేడియో అవకాశాలు ఇప్పిస్తాడు. తొలిసారి ‘రామ మధుర నామం’ అని పాడుతుంది. ఈ పాటను విన్న తదుపరి రంగస్థల నాటక ప్రయోక్తలు, సినీ నిర్మాతలు ఆమెకు మరిన్ని అవకాశాలిస్తారు. ఇలా ఎన్నో సినిమాల్లో రేడియో సన్నివేశాలు.. రక్తికట్టాయి.

ఆధునిక కాలంలో తెలుగు చిత్రాలలో రేడియో ఆనవాలు లేకుండా పోయింది. నేటి తరం వారు విద్యాబాలన్‌ను ‘తుమ్హారీ సులు’ (2017) హిందీ చిత్రం లో రేడియో ప్రెజెంటర్‌గా గుర్తుంచుకుంటారు. ఎవరూ పెద్దగా పట్టించుకోని మధ్యతరగతి గృహిణి, ఒకరోజు రాత్రిపూట ప్రసారమయ్యే రేడియో కాల్-ఇన్-షోలో రేడియో జాకీగా మారుతుంది. ఈ ప్రక్రియలో ఆమె పితృస్వామ్య భావనలను, తన సొంత కుటుంబ సభ్యులను సవాలు చేస్తుంది. ఆమె జీవితంలో పరివర్తనకు రేడియో షో ఒక సాధనంగా మారుతుంది. ‘లగే రహో మున్నాభాయ్’ (2006)లో రేడియో ప్రెజెంటర్‌గా విద్యా అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇంకా ‘రంగ్ దే బసంతి’ (2006), సలాం నమస్తే (2005), ధమాక (2022) మొదలైన చిత్రాలలో రేడియోకు సంబంధించిన ప్రస్తావనలు కన్పిస్తాయి. ఈ విషయంలో మన తెలుగు చిత్రాల కన్నా బాలీవుడ్ చిత్రాలే ముందున్నాయి.
మలయాళంలో ‘మార్కొని మతాయ్’ (2019) పేరుతో తీసిన సినిమాను తెలుగులో ‘రేడియో మాధవ్’ పేరుతో 2021లో విడుదల చేశారు. ఈ చిత్రం కథ అంతా ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రేమ జంటను రేడియోలో పనిచేసే అనౌన్సర్ కలిపే కథ ఇది.
సెప్టెంబర్ 2025లో కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో నిర్మించిన హారర్ మిస్టరీ చిత్రం ‘కిష్కింధపురి’లో 1989 సంవత్సరం నాటి ఒక రేడియో స్టేషన్‌కు వెళ్లడంతో కథ మొదలవుతుంది. అనుపమా పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నాయికానాయకులుగా నటించారు. ఈ సినిమాలో పాతకాలం సినిమాల్లో చూపినట్లు రేడియో స్టేషన్లో పాటలు పాడటం లాంటివి ఉండవు. హారర్ సినిమా కాబట్టి కిష్కింధపురి ఊరిలో సువర్ణమాయ రేడియో స్టేషన్ నుంచి వచ్చే వింత వాయిస్ విని చుట్టు పక్కల వాళ్లెవ్వరూ అటువైపు కూడా వెళ్లరు. కానీ, రాఘవ్ బ్యాచ్ అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. దాంతో అసలు అక్కడ ఏముంది..? రేడియో స్టేషన్లో 1989లో ఏం జరిగింది..? అన్నది చూపించారు.
ఈనాటికీ అడపాదడపా రేడియోకు సంబంధించిన సినిమాలు ఏదో ఒక భాషలో వస్తూనే ఉన్నాయి. మొబైల్ యాప్స్ కారణంగా రేడియోలను ఎవరూ కొనడం లేదు. కొనలేం కూడాను. కారణం ఇపుడు రేడియో సెట్ల తయారీ దాదాపు నిలిచిపోయింది. ఎఫ్.ఎం. బాండ్ పాకెట్ సైజు రేడియోలు కూడా మార్కెట్లో లభించడం లేదు. ప్రైవేటు రేడియోలతో పాటు దేశంలోని ఆకాశవాణి కేంద్రాలు సైతం డిజిటలైజేషన్ దిశగా సాగిపోతున్నాయి. నేడు ఇంటింటా రేడియోలు లేవు. కానీ, రేడియో స్టేషన్లు అలాగే ఉన్నాయి. మీడియం వేవ్, షార్ట్ వేవ్ ప్రసారాలు కూడా లేవు. మొబైల్ యాప్ ద్వారానే ఎఫ్.ఎం. ప్రసారాలు వింటున్నారు. నేటి సినిమాల్లో రేడియో గాన సన్నివేశాలు లేకున్నా.. రేడియో మాత్రం సినిమా పాటలను ప్రసారం చేస్తూ అసంఖ్యాక శ్రోతలను అలరిస్తూనే ఉన్నది.
– డాక్టర్ వి.వి.రామారావు
రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత
98482 37663