ముంబై, డిసెంబర్ 29: విమానయాన రంగ సంస్థలు ఇప్పట్లో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవైపు నిర్వహణ ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు ప్రయాణికులు తగ్గుముఖం పట్టడం, ఇతర సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థలకు రూ.18 వేల కోట్ల వరకు నష్టాలు రావచ్చునని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది. గతంలో రూ.9,500 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల స్థాయిలో నష్టం రావచ్చునని అంచనావేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, అలాగే ఇండియాగోకు చెందిన భారీ స్థాయిలో విమాన సర్వీసులు రద్దు కావడం కూడా మరో కారణమని పేర్కొంది. అలాగే ఈ ఏడాది విమాన ప్రయాణికుల్లో వృద్ధి 0-3 శాతానికి పరిమితం కానున్నదని ఇక్రా అంచనావేస్తున్నది. 4- 6 శాతం మధ్యలో వృద్ధిని నమోదు చేసుకోనున్నదని గతంలో అంచనావేసింది. డిసెంబర్ 3 నుంచి 8 మధ్యకాలంలో ఇండిగో ఏకంగా 4,500 విమాన సర్వీసులను రద్దు చేసింది.