ట్రావెలింగ్ ఓ బోర్ కొట్టని ట్రెండ్. కోరిక, ఆసక్తి, ఉత్సాహం… దీనికి కావల్సిన ముడిసరుకులు. పర్యటనలకు వెళ్లడమే కాదు, వెళ్లే వాళ్లను చూడటమూ ఆనందం కలిగించే అంశమే. అందుకే ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి వాటిలో ట్రావెల్ వ్లాగ్‌లకు చాలామంది అభిమానులు ఉన్నారు. మరి ఇంత క్రేజ్‌ను ఏఐ మాత్రం ఎందుకు వదులుకుంటుంది? చూసేందుకు నిజమైన ఆడపిల్లల్లా కనిపించే ట్రావెలర్లను సృష్టించి వాళ్లతోనే పర్యటనల విశేషాలను చెప్పిస్తున్నది. వివిధ ప్రాంతాలు, అక్కడి ప్రత్యేకతలతో పాటు ట్రావెల్ టిప్స్ కూడా చెప్పే వీళ్లకు వేల సంఖ్యలో ఫాలోయర్లూ ఉన్నారంటే… ఏఐ ట్రావెలర్ల క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరు వీళ్లు ఏంటా సంగతులు… మనమూ ఓసారి చూద్దాం!
ఆమె అడుగులు గోవా బీచ్‌లోని ఇసుకను ముద్దాడుతూ కదలాడుతుంటాయి. అవే పాదాలు కూర్గ్ లోయలోని ఆకుపచ్చని గడ్డి మీద వడివడిగా ఉరకలేస్తాయి. మేఘాలయలో సూర్యరేఖలతో ఆటలాడే మసక మబ్బుల మధ్యనా ఆమె సందడి కనిపిస్తుంది. భారతదేశపు అందమైన ప్రదేశాలలో పర్యటించి ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడమే రాధికా సుబ్రహ్మణియన్ పని. చక్కని భారతీయ కనుముక్కు తీరుతో ఉండే ఆమెకు తమిళం, ఇంగ్లిష్ భాషలు తెలుసు. తాను పర్యటించిన ప్రాంతాలకు సంబంధించిన అందమైన చిత్రాలను చక్కటి క్యాప్షన్లు జోడించి ఫాలోయర్లతో పంచుకుంటుంది.
ఓ దారి వెంట నడిచి వెళితే అక్కడ కనిపించే దృశ్యాలు, ఆ గాలిలోని పరిమళం, ఆకర్షించే వస్తువులు… ఇలా విభిన్న అనుభూతుల గురించీ రాసుకొస్తుంది. ఇక, కట్టూబొట్టులో అయితే జెన్ జెడ్ అమ్మాయిని పోలి ఉండే ఈ ఏఐ మోడల్‌ను జూన్ నెలలో సృష్టించారు. అంతలోనే ఈమె అకౌంట్‌కు ఆరున్నర వేల మందికి పైగా ఫాలోయర్లు అయ్యారంటే మనకూ ఆ హ్యాండిల్‌ను ఓసారి చెక్చేయాలన్న కుతూహలం కలగకమానదు!
దీపావళి పండుగకు దివ్వెలని వెలిగిస్తూ, వాటిని ఇంటి నిండా అలంకరిస్తూ అచ్చంగా అందమైన భారతీయ యువతిలా కనిపిస్తుంది కైరా. బీచ్‌లో యోగా చేస్తున్న తన చిత్రాలనూ ఫాలోయర్లతో పంచుకుంటుంది. తన స్వస్థలం ముంబయి అని చెప్పే ఈ ముద్దులొలికే యువతి ఫ్యాషన్ ట్రెండ్స్‌నూ పంచుకుంటుంది. అదే ఫ్యాషన్‌కు తగ్గట్టు తనను తాను ముస్తాబు చేసుకుని వీడియోలు, ఫొటోలు పెడుతుంది. ఎర్రకోట దగ్గర మువ్వన్నెల జెండాతో, జైపూర్ హవామహల్ దగ్గర దాని నిర్మాణ నైపుణ్యాన్ని ఆస్వాదిస్తూ, ఈజిప్టు పిరమిడ్ల ముందు అక్కడి ఆహార్యంతో… ఇలా దేశవిదేశాల్లో పర్యటిస్తున్నట్టు ఫొటోలు పంచుకుంటుంది. అంతేకాదు, ఉదయపు వెలుగులో టీ కప్పుతోనూ, లగేజీ సర్దుతున్నట్టు, విమానంలో ప్రయాణిస్తున్నట్టు…
చిత్రాలకు చక్కని వ్యాఖ్యలు జతచేసి తన దినచర్యను కూడా చెబుతుంటుంది. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అని అడుగుతూ, తన ప్రయాణాల గురించి వాళ్ల అభిప్రాయాలనూ తెలుసుకుంటూ ఉంటుంది. ఇక, కైరాకు రెండులక్షల యాభైవేలకు పైగా ఫాలోయర్లు ఉండటంతో తనతో ప్రకటనలు చేసేందుకు కూడా చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. కార్లు, మొబైల్స్, హెడ్‌సెట్స్, కొత్త టెక్నాలజీతో వచ్చే గ్యాడ్జెట్లు, ఫ్యాషన్ బ్రాండ్లు ఇలా ఎన్నో కైరాతో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ఈ మోడల్ని 2022లో సృష్టించారు. దీని వ్యవస్థాపకులు… వ్యాపారులకు వనరుల సమీకరణకు సాయపడేందుకు ఉద్దేశించిన షార్క్‌ట్యాంక్ కార్యక్రమానికి వెళ్లడంతో కైరా ఆ వేదిక మీదా మాట్లాడింది. మరి… ఏఐ ట్రావెలరా మజాకానా!
ఎంత ఏఐ క్రియేటర్లయితే మాత్రం దోస్తులు ఉండరా. ఉండొద్దా?! అందుకే ఇండోనేషియా దేశానికి చెందిన ఏఐ ట్రావెలర్ తలస్య తన మిత్రురాలితో కలిసి రకరకాల సంగతులు పంచుకుంటుంది. ఆమె మిత్రురాలి పేరు జెలీన్. ఆమె కూడా వర్చువల్ మోడలే. ఇద్దరూ కలిసి ప్రయాణిస్తూ సెల్ఫీలు దిగుతూ ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఇక, తలస్యకు ట్రావెలింగ్ అంటే పిచ్చి. పురాతన ప్రదేశాలు, మారుమూల బీచ్‌లు, రకరకాల క్లబ్‌లు … ఇలా ఎన్నో ప్రదేశాలను పరిచయం చేస్తుంటుంది. ముఖ్యంగా ఇండోనేషియాలో ఉండే బాలి, జకార్తాలాంటి దీవుల్లో తిరుగుతూ ఆ ప్రదేశాల అందమైన చిత్రాలను పోస్ట్ చేస్తుంటుంది.
సింగపూర్, అమెరికా తదితర దేశాలకూ ప్రయాణిస్తూ అక్కడి వారితోనూ ఫొటోలు పెడుతూ వాటికి మంచి క్యాప్షన్లు ఇస్తూ ఆయా ప్రదేశాల వివరాలు చెబుతుంది. ఇతర ఏఐ మోడళ్లతో కలిసి ఫ్యాషన్ సంస్థలకు అడ్వర్టయిజ్మెంట్లు కూడా చేస్తుంది. ఫుడ్, టెక్నాలజీ రంగాల వాళ్లూ తమ గురించి చెప్పేందుకు తలస్యను సంప్రదిస్తారు. 2018లో తెరమీదరకు వచ్చిన ఈ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌కి అయిదులక్షల దాకా ఫాలోయర్లు ఉన్నారు. తన లైఫ్ ైస్టెల్కి సంబంధించీ ఆకర్షణీయమైన పోస్ట్‌లు చేస్తూ, ఫాలోయర్ల ప్రశ్నలకు స్పందిస్తూ ఉండే ఆమెకు ఫ్యాన్‌బేస్ కూడా ఎక్కువే!
దేశాలు తమ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక కృషి చేస్తుంటాయి. అలా జర్మనీ కూడా జర్మన్ నేషనల్ టూరిస్ట్ బోర్డ్ అనే సంస్థతో కలిసి పనిచేస్తుంది. ఆ దేశంలోని పర్యాటక ప్రదేశాలు, ప్రత్యేకతలు, టూర్ ప్యాకేజీలు… ఇలా రకరకాల అంశాలను ప్రజలకు తెలియజేసే ఈ సంస్థ తమ అంబాసిడర్‌గా ఎమ్మా పేరిట 2023లో ఏఐ ట్రావెలర్‌ను తయారుచేసింది. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన ష్క్రెక్స్జీలాంటి సరస్సులు, గార్లిట్జ్లాంటి ప్రత్యేక నిర్మాణశైలి నగరాలు, వాడెన్ సీ లాంటి యునెస్కో గుర్తింపు పొందిన సముద్ర తీరప్రాంతాలు ఆకర్షణీయమైన చిత్రాలతో సహా తన పోస్ట్‌లు, రీల్స్‌లో కనిపిస్తాయి.
అంతేకాదు, అక్కడి పరిసరాల్ని వర్ణిస్తూ, వెళ్లినప్పుడు కలిగే అనుభూతులన్నీ అచ్చం మనుషుల్లాగే పంచుకుంటుంది ఎమ్మా. జర్మనీ రాజధాని బెర్లిన్ తన స్వస్థలం అని చెప్పే ఈ ఏఐ ట్రావెలర్ 20 భాషలు మాట్లాడగలదు. అంతేకాదు, చాట్‌బాట్ ద్వారా పదివేలకు పైగా ఉన్న తన ఫాలోయర్లతో అప్పుడప్పుడూ కబుర్లు చెబుతుంది కూడా. వీసా పాస్‌పోర్ట్‌లు, విమానం ఖర్చుల ముచ్చటే లేదు. అలసట, ఆదివారాల్లాంటి సమస్యలూ లేని ఈ ఏఐ ట్రావెలర్లు మనుషులతో బాగానే పోటీ పడుతున్నారట.