లైఫ్‌లో ఒకప్పుడు విచిత్రంగా అనిపించినవి.. ఇప్పుడు చాలా మామూలుగా మారిపోయాయి. పిలిస్తే గ్యాడ్జెట్లు పలకడం.. ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్.. వర్చువల్ వరల్డ్.. కృత్రిమ మేధ (AI) మాయలు చేసేస్తున్నది. ఇప్పుడీ ఏఐ మరింత అబ్బుర పరిచేందుకు సిద్ధమైంది. ఏఐ ప్లాట్‌ఫామ్‌లు మ్యూజిక్ వరల్డ్‌లోకి అడుగుపెట్టాయి. అవి మన మనసులో ఉన్న భావాలకు తగ్గట్లుగా, కేవలం కొన్ని పదాలు రాస్తే చాలు.. బాణీలు కట్టేస్తున్నాయి.
AI Music | మన మూడ్‌ను మంచి పాట మార్చేస్తుంది. బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు మనతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. ఇప్పటి వరకూ ఈ తరహా మ్యూజిక్.. సినిమాల్లో, ప్రైవేటు ఆల్బమ్స్‌లోనే మనకు తెలుసు. కానీ, వ్యక్తిగతంగా మీరు షూట్ చేసే వీడియోలకో.. మీరు తీసిన షార్ట్ఫిల్మ్లకో.. మ్యూజిక్ కావాలంటే? మీరే ట్యూన్ చేయాలంటే? పాటను వెతకడం చాలా కష్టం. ఒకవేళ నచ్చిన పాట దొరికినా.. కాపీరైట్ ఇబ్బందులు ఉంటాయి. ఒక యూట్యూబర్, షార్ట్‌ఫిల్మ్ తీసే డైరెక్టర్, క్రియేటర్ తరచుగా ఈ సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికి పరిష్కారమే ఈ ఏఐ మ్యూజిక్ టూల్స్.
క్రియేటర్స్ కోసం ఎలెవెన్ ల్యాబ్స్ సంస్థ కొత్త ఏఐ టూల్ ఎలెవెన్ మ్యూజిక్ లాంచ్ చేసింది. కేవలం కొన్ని పదాలు రాస్తే చాలు, ఈ టూల్ మంచి పాటను ట్యూన్ చేసి ఇస్తుంది. ఇది రాయల్టీ ఫ్రీ కాబట్టి కమర్షియల్ అవసరాలకు కూడా వాడుకోవచ్చు. https://elevenlabs.io పేరుతో వచ్చిన ఈ కొత్త ఏఐ టూల్‌తో మీరే మ్యూజిక్ క్రియేటర్ అవ్వొచ్చు. ఎలాగంటే.. దీంట్లో మీకు కావాల్సిన పాట కోసం కమాండ్ ప్రాంప్ట్స్ రూపంలో కొన్ని పదాలు రాస్తే చాలు. అంటే.. లిరిక్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. క్షణాల్లో అది పాటగా వినిపిస్తుంది. ఉదాహరణకు, మీరు రాత్రి సమయంలో వినేలా ప్రశాంతమైన పియానో మ్యూజిక్ కావాలి అని రాస్తే, ఏఐ మీకోసం ఒక కొత్త పాటను తయారు చేసి ఇస్తుంది. ఈ టూల్‌తో మీకు నచ్చినట్లు మ్యూజిక్‌ను మార్చుకునే అవకాశం కూడా ఉంది. దీనితో వేర్వేరు భాషలు, జోనర్స్‌కు సంబంధించిన పాటలను సులభంగా తయారు చేసేయొచ్చు. ఈ టూల్ తయారు చేసిన మ్యూజిక్‌ను ఎలాంటి భయం లేకుండా కమర్షియల్ అవసరాలకు కూడా వాడుకోవచ్చు. ప్రీమియం వెర్షన్‌కి అప్డేట్ అయితే మరిన్ని ఫీచర్స్‌ని వాడుకోవచ్చు.
యూట్యూబర్స్ ఇక టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఏఐతో ట్యూన్స్ మీరే తయారు చేసుకోవచ్చు! యూట్యూబ్ క్రియేటర్స్ కోసం ప్రత్యేకంగా ఏఐ మ్యూజిక్ టూల్ లాంచ్ చేసింది. దీంతో రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అందిస్తున్నది. ఇంతకీ దీని పేరేంటో తెలుసా? మ్యూజిక్ అసిస్టెంట్. క్రియేటర్లకు కావాల్సిన పాటలను ఈ టూల్ క్షణాల్లో తయారు చేసి ఇస్తుంది. మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలో కొన్ని పదాలతో చెప్తే కాగల కార్యం తీర్చేస్తుంది. ఉదాహరణకు, మీరు ‘లవ్ ఫీల్‌తో కూడిన గిటార్, పియానో మిక్స్ ట్యూన్ కావాలి’ అని రాస్తే చాలు. ట్యూన్ రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఇచ్చిన కమాండ్ ప్రాంప్ట్స్ ఆధారంగా ట్యూన్స్‌ని ఏఐ జనరేట్ చేస్తుంది. వాటిలో మీకు నచ్చిన దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఈ పాటలు అన్నీ రాయల్టీ ఫ్రీ. దీంతో క్రియేటర్స్‌కు టైం ఆదా అవుతుంది. కాపీరైట్ గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న క్రియేటర్స్‌కు, ఎవరైతే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో భాగస్వాములై ఉన్నారో వారికి మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని యూట్యూబ్ చెబుతున్నది.