‘ఇటీవల బెంగళూరుకు వెళ్లినప్పుడు తమిళనాడుకు చెందిన ఓ లాయర్ నన్ను కలిశాడు. తనపై కొందరు దాడి చేయడంతో చాలా కాలం హాస్పిటల్లో ఉన్నానని, బయటకు రావాలంటే భయపడే పరిస్థితుల్లో ‘మేజర్’ సినిమా ధైర్యాన్నిచ్చిందని చెప్పాడు. అదే నమ్మకంతో ‘డెకాయిట్’ని తొలిరోజే చూశానన్నాడు. నన్ను కలవడానికే ప్రత్యేకంగా వచ్చానని చెబుతూ ఎమోషనల్‌గా మాట్లాడారు. అప్పుడు నాకు అర్థమైంది..మనం సినిమా బిజినెస్ గురించి ఆలోచిస్తూ మానవత్వాన్ని ఎక్కడో మర్చిపోతాం. ఆయన నాకు మళ్లీ మానవత్వాన్ని గుర్తుచేశాడు’ అన్నారు అడివి శేష్. ఆయన కథానాయకుడిగా షానిల్ డియో దర్శకత్వంలో రూపొందిన ‘డెకాయిట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన థాంక్స్‌మీట్‌లో అడివిశేష్ పై విధంగా స్పందించారు. బెంగళూరులో కలిసిన లాయర్ చెప్పిన మాటలు తనకు ఓ పురస్కారంలా అనిపించాయన్నారు. ప్రేమకథను తెరకెక్కించడంలో ఉండే ఆనందమే వేరని, ఈ సినిమా తీసినందుకు గర్విస్తున్నానని చిత్ర నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌తో పాటు యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.