Adipurush Movie on Ott | ఈ మధ్య కాలంలో ఓ రేంజ్లో నెగెటివిటీ ఎదుర్కొన్న సినిమా ఏదంటే టక్కున గుర్తొచ్చేది ఆదిపురుష్ సినిమానే. అప్పుడెప్పుడో ఏడాది కిందట విడుదలైన టీజర్ విపరీతమైన ట్రోల్స్‌కు గురైంది. ఎంతలా అంటే దెబ్బకు మేకర్స్ సినిమాను ఆర్నెళ్లు పోస్ట్ పోన్ చేసేంతలా. మళ్లీ వీఎఫ్ఎక్స్పై కూర్చునేంతలా. అంత చేసి చివరికి తెచ్చుకుంది మళ్లీ నెగెటివ్ రెస్పాన్సే. ఇక రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై పాటలు, ట్రైలర్ ఓ రేంజ్లో హైప్ తెచ్చిపెట్టాయి. టిక్కెట్లు సైతం ఆన్లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. సినిమాకొచ్చిన హైప్ చూస్తే ప్రభాస్‌కు మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అందరూ భావించారు. తీరా రిలీజయ్యాక ఒక్క పాజిటీవ్ రివ్యూ కూడా రాలేదు. అయితే కలెక్షన్లు మట్టుకు ఫస్ట్ వీకెండ్లో భీభత్సం సృష్టించాయి.
తొలిమూడు రోజుల్లో మూడొందల కోట్లు కొల్లగొట్టి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అని మరోసారి రుజువైంది. అయితే వీక్ డేస్‌లో మాత్రం సినిమా చాలా వీక్ అయిపోయింది. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడ్డారు. దానికి తోడు డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం పుండు మీద కారం చల్లినట్లు అయింది. దాంతో కలెక్షన్లు దిబేల్మని పడిపోయాయి. ఫైనల్ రన్లో ఈ సినిమా రూ.450 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించింది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రావడంతో కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా నష్టాలు తెచ్చిపెట్టలేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూశారు.
కాగా సైలెంట్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. గత అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ఆయా సంస్థలు పెద్ద మొత్తంలో చెల్లించినట్లు ఇన్సైడ్ టాక్. కేవలం ఓటీటీ హక్కులతోనే సినిమా సగం బడ్జెట్ రికవరీ అయిందని టాక్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా.. కృతిసనన్ సీత పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడు పాత్ర పోషించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది.