Adarsha Kutumbam | టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబోలలో విక్టరీ వెంకటేష్–దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఏళ్లుగా ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతూ వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి ‘ఆదర్శ కుటుంబం AK47’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబోపై ప్రేక్షకుల్లో ఇంతటి అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం వీరి గత అనుబంధమే. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించి అవి ఎవర్గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లుగా నిలిచాయి.
విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా టీవీలో వస్తే తప్పక చూసే సినిమాలుగా అవి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఆ కామెడీ టైమింగ్, భావోద్వేగాలు, కుటుంబ విలువలు కలిసి వచ్చిన మ్యాజిక్ మళ్లీ తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే కోరికను నెరవేర్చేలా ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ అత్యంత వేగంగా పూర్తి చేయాలని గట్టి ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు షూటింగ్ పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పడుతాయనే అభిప్రాయం ఉన్నా, ఈ సినిమాతో ఆ ఇమేజ్ను మార్చాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారట. మే నెల కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, సమ్మర్లోనే సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో షెడ్యూళ్లను కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తున్నారని టాక్.
గత చిత్రం ‘గుంటూరు కారం’ తర్వాత తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో జాగ్రత్తగా, అదే సమయంలో స్పీడ్‌గా తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మరోవైపు వెంకటేష్ కూడా పూర్తిగా ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టడంతో షూటింగ్ సాఫీగా సాగుతోందని సమాచారం. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ, వినోదంతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుండటంతో, ‘ఆదర్శ కుటుంబం’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ క్రేజీ కాంబో మళ్లీ ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.