‘ఓటీటీ మాధ్యమాల ప్రభావంతో సినిమాల మధ్య ఉన్న భాషాపరమైన హద్దులు తొలగిపోతున్నాయి. కంటెంట్‌కు విలువ పెరిగింది. మంచి కథ ఉంటే అదే సినిమాను పాన్ ఇండియన్ స్థాయికి తీసుకెళుతుంది’ అని అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నాని పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లో మీ సినిమా విడుదలకాబోతుండటం ఎలాంటి అనుభూతిని పంచుతోంది?
థియేటర్స్‌లో సినిమా చూడటం నాకు ఇష్టం. చిన్నతనం నుంచి అదో పెద్ద అలవాటుగా మారిపోయింది. థియేటర్స్‌తో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత నా సినిమాను మొదటిరోజు థియేటర్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఉత్సుకతగా ఎదురుచూస్తున్నా.
పీరియాడికల్ సినిమా చేయాలనే ఆలోచనకు కారణమేమిటి?
బడ్జెట్ పరంగా పీరియాడికల్ సినిమాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కథలో బలం ఉన్నప్పుడే ఈ సినిమాలు వర్కవుట్ అవుతాయి. 1960-70 కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌కు నేటి కాలాన్ని ముడిపెడుతూ సాగే చిత్రమిది. ఆనాటి శైలిని తలపిస్తూ వేసిన సెట్స్, కెమెరా విజువల్స్ అన్ని 1970 కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళతాయి. ఆరోజుల్లో ప్రత్యక్షంగా విహరించిన అనుభూతిని కలిగిస్తాయి.
రెండు భిన్న పార్శాలతో కూడిన పాత్రను చేయడం చాలెంజింగ్‌గా అనిపించిందా?
ఇందులో వాసు అనే సహాయదర్శకుడిగా, శ్యామ్‌సింగరాయ్ అనే బెంగాళీ సాహితీవేత్తగా నేను కనిపిస్తా. వాసు క్యారెక్టర్ గురించి దర్శకుడు చెప్పగానే నా కెరీర్ ఆరంభంలో సహాయదర్శకుడిగా పనిచేసిన రోజులు గుర్తొచ్చాయి. ఈ సినిమాలో చూపించిన కష్టాలతో పోలిస్తే రియల్‌లైఫ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎక్కువ కష్టాలు పడ్డా. అవేవీ ఇందులో చూపించలేదు. దర్శకుడు కావాలని కోరుకునే కుర్రాడిగా వాసు పాత్ర చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. శ్యామ్‌సింగరాయ్ పాత్ర కోసం ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తులు చేయలేదు. నా నడక, మాట్లాడే తీరు, హావభావాల్లో మార్పులు చేసుకుంటూ నటించా. ఆ వైవిధ్యత అందరిని ఆకట్టుకుంటుంది. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించడానికి ఎలాంటి విరా మం తీసుకోలేదు. వాసు పాత్రను పూర్తిచేసిన వెంటనే శ్యామ్‌సింగరాయ్ పాత్ర తాలూకు షూటి ంగ్ మొదలుపెట్టాం.
ప్రచార వేడుకల్లో మీరు మాట్లాడిన తీరు చూస్తుంటే సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది?
చెడుపై పోరాటం చేసే వ్యక్తిగా శ్యామ్‌సింగరాయ్ పాత్ర శక్తివంతంగా కనిపిస్తుంది. సమాజంలోని దురాచారాలపై పోరాడే అతడు ఎలా ప్రేమలో పడతాడు?అతడి లక్ష్యానికి అండగా నిలిచే దేవదాసీ ఎవరన్నది ఆకట్టుకుంటుంది. మంచి లవ్‌స్టోరీ చూసిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. సినిమా బాగుంది కాబట్టే ఒత్తిడి లేకుండా ధైర్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. విడుదల రోజు మొదటి ఆట పూర్తయిన తర్వాత మంచి కథగా నమ్మి ప్రేక్షకులే సినిమాను ముందుకు తీసుకెళతారనే నమ్మకముంది.
ఓటీటీలో విడుదలైన మీ గత సినిమాల ఫలితాల్ని ఎలా విశ్లేషిస్తారు?
‘వీ’, ‘టక్ జగదీష్’ సినిమాలు చేసినందుకు నటుడిగా నేను సంతోషంగా ఉన్నా. ఓటీటీలో విడుదలైన ఆ సినిమాలు నిర్మాతలకు లాభాల్ని తెచ్చాయి. వాటికి లభించిన స్పందన బాగుందని ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఆ సినిమాలు సక్సెస్ కాదని నిరూపించడానికి నా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఓటీటీలో సక్సెస్‌కు కొలమానాలు ఉండవు. ఎంత మంది సినిమాను చూశారో అనే లెక్కలను ఓటీటీ సంస్థలు వెల్లడించవు. థియేటర్స్ కోసం సినిమాల్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు సంతోషంగా ఉండటమే ముఖ్యమనిపించింది. అందుకే ఓటీటీలో నా సినిమాలు విడుదలచేయడానికి అంగీకరించా. ఓటీటీల వల్ల నా కెరీర్‌కు ఇబ్బంది అవుతుందనే, ఇమేజ్ తగ్గిపోతుందనే భయం నాలో ఎప్పుడూ రాలేదు.
తెలంగాణ నేపథ్యంలో చేయబోతున్న ‘దసరా’ షూటింగ్ ఎప్పుడు మొదలుకానున్నది?
‘దసరా’ చిత్రాన్ని ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకొస్తాం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరూ ఉపయోగించని స్వచ్ఛమైన తెలంగాణ యాసను ఈ సినిమాలో చూపించబోతున్నాం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న ‘అంటే సుందరానికి’ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదలచేయనున్నాం.
కృతిశెట్టికి ఒక్క సినిమా చేసిన అనుభవమే ఉంది. ఇండస్ట్రీ వాతావరణానికి, షూటింగ్‌లకు ఆమె పూర్తిగా అలవాటుపడలేదు. షూటింగ్ సమయంలో చాలా ప్రశ్నలు వేసేది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ చక్కటి నటనను కనబరిచింది. ‘ఎమ్సీఏ’ తర్వాత ఓ చాలెంజింగ్ ప్రాజెక్ట్‌లో మళ్లీ కలిసి నటిద్దామని నేను, సాయిపల్లవి అనుకున్నాం. అది ఈ సినిమాతో కుదిరింది. బాధ్యతతో కూడిన క్యారెక్టర్లో సాయిపల్లవి కనిపించబోతున్నది.